ధమాకా రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ మలయాళ చిత్రానికి రీమేక్ అని గట్టిగా ప్రచారం సాగింది. అయితే ప్రసన్నకుమార్ మాత్రం ఇది రీమేక్ కాదని, తన సొంత కథని గట్టిగా ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే.. మలయాళ చిత్రం `పొరింజు మరియమ్ జోస్` రీమేక్ రైట్స్‌ని చిత్రబృందం అధికారింగా కొనుగోలు చేసింది. నిన్నా మొన్నటి వరకూ ఈ రీమేక్‌రైట్స్ బేరం తెగలేదు. అవుతుందా? లేదా? అనే డైలామా కొనసాగింది. చివరికి రీమేక్ రైట్స్ చేజిక్కించుకొన్నారు. ఇప్పుడు ఇది అఫీషియల్ రీమేకే. అయితే.. దాన్ని కప్పిపుచ్చడానికి ప్రసన్నకుమార్ ఎందుకు ప్రయత్నించాడో అర్థం కావడం లేదు. రీమేక్ రైట్స్ సొంతం చేసుకొన్న తరవాత కూడా.. రీమేక్ కాదని, ఎలా అంటారు.? పోనీ మలయాళ సినిమాలోని పాయింట్ పట్టుకొని, దాన్ని పూర్తిగా మార్చి చేస్తున్నారా? అనుకొంటే, అలాంటప్పుడు అన్ని డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్ కొనడం ఎందుకు?
రావణాసుర విషయంలోనూ ఇదే జరుగుతోంది. `విన్సిడా` అనే ఓ బెంగాళీ చిత్రారినికి ఇది రీమేక్. రైట్స్కూడా అఫీషియల్‌గానే కొనుగోలు చేశారు. అయినా రచయిత శ్రీకాంత్ విస్సా మాత్రం రీమేక్ అని చెప్పుకోవడానికి ఒప్పుకోవడం లేదు. మొత్తానికి నాగార్జున సినిమాకి సంబంధించిన రీమేక్ రైట్స్ ప్రోసెస్ పూర్తయ్యింది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే తరువాయి.