గతేడాది అక్కినేని నాగార్జున నుంచి రెండు చిత్రాలు వచ్చాయి. ‘ఆఫీసర్’ అభిమానులను ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచగా… ‘దేవదాస్’ పర్వాలేదనిపించుకుంది. 2017లో నటించిన ‘రాజుగారి గది-2’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొత్త చిత్రాలపై నాగార్జున జాగ్రత్తలు వహిస్తున్నారు. తదుపరి రెండు చిత్రాలను సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే పట్టాలు ఎక్కనున్నాయి.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించనున్న ‘మన్మథుడు 2’ చిత్రీకరణ మార్చిలో మొదలు కానుంది. సుమారు 60 రోజులు విదేశాలలో చిత్రీకరణ చేయనున్నారు. ‘మన్మథుడు 2’ ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి రాగానే… కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నటించనున్న ‘బంగార్రాజు’ చిత్రీకరణ ప్రారంభించాలని నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు.
‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య తాత మనవళ్లుగా కనిపిస్తారని తెలుస్తుంది. జూన్ నెలలో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనేది నాగార్జున ప్లాన్.