నాగార్జున సినిమా `వైల్డ్ డాగ్` ఓటీటీలో విడుదల అవుతుందని, నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని భారీ రేటు పెట్టి కొనుగోలు చేశారని ప్రచారం జరిగింది. దీనిపై నాగార్జున స్పందించారు. వైల్డ్ డాగ్ ఓటీటీ కోసం తీసిన సినిమా కాదని, దీన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అయితే.. నవంబరు సమయంలో ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్ వచ్చిందని, తాము ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని భావించామని, అయితే.. మారిన పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడు థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
”నవంబరులోనే సినిమా పూర్తయ్యింది. అప్పుడు థియేటర్లన్నీ బంద్ అయ్యాయి. థియేటర్లు తెరచుకుంటాయో లేదో తెలీదు, జనాలు థియేటర్లకు వస్తారో రారో తెలీదు. ఓటీటీ వాళ్లు మంచి ఆఫర్ ఇచ్చారు. అందుకే ఈ సినిమాని వాళ్లకి ఇచ్చేశాం. సంక్రాంతి నుంచి పరిస్థితి మారిపోయింది. క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలకు జనాదరణ బాగా లభించింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారన్న నమ్మకం ఏర్పడింది. అందుకే ఓటీటీ నుంచి ఈసినిమాని వెనక్కి తెచ్చుకున్నాం. ఇప్పుడు థియేటర్లలోనే విడుదల చేస్తున్నాం” అన్నారు. ఏప్రిల్ 2న ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రకటించారు. సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హైదరాబాద్ లో జరిగిన బాంబు పేళుళ్ల నేపథ్యంలో సాగుతుంది.