టాలీవుడ్ శివ అతనే… తెలుగు అమ్మాయిలకు మన్మథుడే తనే. కలల్లోకి వచ్చే గ్రీకు వీరుడు మళ్లీ అతనే. ఇవన్నీ నాగార్జున గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు కదా?? అగ్ర కథానాయకుడిలో ఒకడిగా దశాబ్దాల పాటు ప్రయాణం సాగిస్తూ, ఇప్పటికీ అదే క్రేజ్ దక్కించుకొంటున్న కథానాయకుడు నాగార్జున. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ, కొత్తదానానికి ప్రాధాన్యం ఇవ్వడంలోనూ నాగ్ ఎప్పుడూ ముందే ఉంటాడు. అందుకే అతన్నుంచి అన్నిమంచి సినిమాలొచ్చాయి.. నాగ్ని నమ్ముకొని అంతమంది దర్శకులయ్యారు. నాగ్.. తన నట ప్రయాణం మొదలెట్టి నేటికి సరిగ్గా 30 ఏళ్లు. నాగార్జున కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం విక్రమ్.. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది.
ఈ విషయాన్ని నాగ్ కూడా తన ట్విట్టర్లో పంచుకొన్నారు. అభిమానుల ఆశీస్సుల వల్లే ఇలా ఉన్నానని, ఈ సహకారం మరో 30 ఏళ్లు కూడా ఉంటుందని ఆశిస్తున్నానని నాగ్ ట్వీట్ చేశాడు. అయితే ఈ సమయంలో అమ్మానాన్నని మిస్ అవుతున్నా అంటూ హార్ట్ టచింగ్ ఎండింగ్ ఇచ్చాడు. నాగ్.. స్టామినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. నిజం చెప్పాలంటే కమర్షియల్‌గా అతని కెరీర్లో భారీ విజయాలు ఈమధ్యే అందాయి. సోగ్గాడే చిన్నినాయిన 50 కోట్లు దాటింది. ఊపిరి వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ రెండు విజయాలూ నాగ్‌కి మరో పదేళ్లకు సరిపడ బూస్టింగ్ ఇస్తాయనడంలో సందేహం లేదు. ఆల్ ద బెస్ట్ నాగార్జున.