ధనుష్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక కథానాయిక. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో మరో కీలకమైన పాత్ర ఉంది. అందులో నాగార్జున నటిస్తే బాగుంటుందన్నది శేఖర్ కమ్ముల ఆలోచన. ఇటీవల నాగ్ ని కలిసి కథ కూడా వినిపించాడు. శేఖర్ కమ్ముల స్టైల్, వ్యక్తిత్వం, ట్రాక్ రికార్డ్ ఇవన్నీ నాగార్జునకి బాగా తెలుసు. ఈ క్యారెక్టర్ నాగ్ ని టెమ్ట్ చేసేదే. అయితే నాగార్జున తన నిర్ణయాన్ని హోల్టింగ్ లో పెట్టాడు.
దానికి ప్రధాన కారణం.. నాగ్ వందో సినిమానే. ఓ మలయాళ చిత్రాన్ని నాగ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లెక్క ప్రకారం అది నాగ్ 99వ చిత్రం. వందో సినిమాకి కాస్త గ్రాండ్ గా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచాలన్నది ఆయన ప్రయత్నం. అందుకోసం ఓ కథ కూడా సిద్దమైంది. శేఖర్ కమ్ముల సినిమా గనుక ఒప్పుకొంటే… వందో సినిమా ఆలస్యం అవుతుంది. శేఖర్ కమ్ముల సినిమానే నాగ్ 100వ సినిమా అవుతుంది. అందుకే.. నాగ్ కాస్త డైలామాలో పడినట్టు టాక్. వందో సినిమా మైలు రాయి లెక్కల్ని పక్కన పెడితే.. శేఖర్ కమ్ముల సినిమాకు ఎలాంటి అడ్డూ లేనట్టే. వందో సినిమా గురించి ఆలోచిస్తే మాత్రం శేఖర్ కమ్ముల ఆఫర్‌ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓ వారం రోజుల్లో ఈ విషయంలో ఓ క్లారిటీ రావొచ్చు.