అక్కినేని నాగార్జునను అందరూ అందగాడు అని అంటుంటారు. ఆయన వయసు 59. అయితేనేం? ఆరు పదుల వయసుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నా… పాతికేళ్ళ కుర్రాడిలా వుంటారని అందరూ ప్రశంసిస్తుంటారు. ‘దేవదాస్’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ ‘నా వయసు 59. కాని నేను పాతికేళ్ళ కుర్రాడిలా ఆలోచిస్తా’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఆయనలో ఒక సందేహం వున్నట్టుంది… ‘ఈ వయసులో స్టైలుగా కనిపిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో’ అని! ఆ సందేహాలకు ‘దేవదాస్’తో సమాధానం దొరికినట్టుంది. ఈ రోజు మీడియాతో ‘దేవదాస్’ సినిమా గురించి మాట్లాడిన నాగార్జున ‘‘ప్రేక్షకులు ఈ సినిమాలో నన్ను స్టైలిష్ డాన్ క్యారెక్టర్లో చూశారు. డాన్ దేవాగా నా లుక్‌కి, యాక్టింగ్‌కి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం చూస్తే… ఫ్యూచర్లో ఇటువంటి రోల్స్ చాలా చెయ్యవచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది’’ అన్నారు. ఆ విధంగా ‘దేవదాస్’తో నాగార్జునకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట! విడుదలకు ముందు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బద్దకస్తుడు అని మీడియా ముఖంగా చెప్పిన నాగార్జున, విడుదల తర్వాత తనను, నానినీ బాగా హ్యాండిల్ చేశాడని కితాబు ఇచ్చారు.