ఈమధ్యకాలంలో కింగ్ నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ ఎంటర్టైనర్స్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ మాత్రమే చేశారు. చాలా కాలం తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పంచెకట్టుతో సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సినిమా కాబోతోందని అక్కినేని అభిమానులు చాలా హ్యాపీగా చెప్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కింగ్ నాగార్జునతో జరిపిన ఇంటర్వ్యూ
‘మనం’ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏమైనా వుందా?
– ‘మనం’ మా బేనర్లో చేసిన ప్రెస్టీజియస్ మూవీ. ఆ చిత్రాన్ని తప్పకుండా మంచి చిత్రంగా, ఓ క్లాసిక్ మూవీగా చేయాలని పూర్తి కాన్సన్ట్రేషన్తో చేశాం. మేం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మాకు, మా బేనర్‌కి ఓ మెమరబుల్ హిట్ అయింది ‘మనం’. ఆ తర్వాత రెండు నెలలు రెస్ట్ తీసుకున్నప్పటికీ ఆ తర్వాత మీలో ఎవరు కోటీశ్వరుడు, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల షూటింగ్‌తో బిజీగా వున్నాను. ఈమధ్యకాలంలో నా సినిమా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ గ్యాప్ తీసుకున్నట్టు మీకు అనిపిస్తోంది.
ఈ సంక్రాంతికి మీ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు వస్తున్నాయి. అది మీకెలా అనిపిస్తోంది?
– సంక్రాంతి అంటే తెలుగువారి పెద్ద పండగ. అలాంటి పండగకి ఎక్కువ సినిమాలు రావడం మంచిదే కదా! ఈ సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూనే వుంటాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ దసరాకి రిలీజ్ అవ్వాల్సి వుంది. ఆ టైమ్‌లో ‘అఖిల్’ రిలీజ్ కోసం ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేశాం. అయితే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చెయ్యడమే కరెక్ట్ అని నాకు తర్వాత అనిపించింది. ఈ పండగకి రెండు, మూడు సినిమాలు రిలీజ్ అయినా దేని మార్కెట్ దానికే వుంటుంది కాబట్టి ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ వుండదు.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
– ఈ సినిమా పూర్తిగా పండగ వాతావరణంలో చేసిన సినిమా. అందుకే సంక్రాంతికి వస్తేనే బాగుంటుందని అనుకున్నాను. ఈ పండగకి ఎలాంటి సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి ఎంటర్టైన్మెంట్ వుంటూనే అందర్నీ ఆకట్టుకుంటుందీ సినిమా.
ఈ సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి కదా. ఈ కథలో మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన అంశాలేమిటి?
– రామ్మోహన్ ఈ కథ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. కథలో మంచి ఎమోషన్ వుంది, అందరికీ నచ్చే ఫన్ వుంది. ఈమధ్యకాలంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కువగా సినిమాలు రాలేదు. పైగా బంగార్రాజు లాంటి క్యారెక్టర్ ఈమధ్య నేనూ చెయ్యలేదు. ఇవన్నీ ఈ కథలో నాకు నచ్చాయి. ఇక సోషియో ఫాంటసీ ఎలిమెంట్ అనేది సినిమాకి మంచి ప్లస్ అవుతుంది.
‘హలో బ్రదర్’లో డూయల్ రోల్ చేశారు. ఈ సినిమాలో మీరు చేసిన రెండు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసేలా వుంటాయా?
– ‘హలో బ్రదర్’ సినిమా అంతా ఎంటర్టైనింగ్గానే వుంటుంది. ఈ సినిమాలోని రెండు క్యారెక్టర్లు కూడా ఆడియన్స్‌ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. బంగార్రాజు అనే క్యారెక్టర్ సోగ్గాడు తరహా వేషాలతో నవ్విస్తుంది, మరో క్యారెక్టర్ అమాయకంగా వుంటూ అందర్నీ మెప్పిస్తుంది.
చాలాకాలం తర్వాత రమ్యకృష్ణతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
– రమ్యకృష్ణ అప్పుడెలా వుండో ఇప్పుడూ అలాగే వుంది. మా ఇద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా అందరికీ ‘హలోబ్రదర్’ సినిమాని మరోసారి గర్తుచేస్తుందని చెప్పగలను. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా చాలా బాగా చేసింది.
కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణతో చేయడం రిస్క్ అనిపించలేదా?
– రిస్క్ అని ఎప్పుడూ అనుకోలేదు. నాకు యంగ్ జనరేషన్‌తో పనిచేయడం అంటే ఇష్టం. కళ్యాణ్‌కృష్ణ మంచి రైటరే కాకుండా ఎమోషన్స్‌ను ఎలా చూపించాలనే విషయంపై మంచి పట్టు వుంది. సినిమా చూసిన వారెవరికైనా ఇది కొత్త దర్శకుడు చేసిన సినిమాలా లేదు అనిపిస్తుంది. చాలా మంచి ఔట్పుట్ ఇచ్చాడు.
సంక్రాంతికి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు మంచి మార్కెట్ వున్నప్పటికీ థియేటర్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదా?
– సంక్రాంతికి సినిమా రిలీజ్ చెయ్యడం కోసం నవంబర్ నెలలోనే థియేటర్లు బుక్ చెయ్యడం జరిగింది. అంతే కాకుండా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సినిమాని రిలీజ్ చెయ్యడం కూడా నాకు నచ్చదు. మొదట ఈ సినిమాని 500 థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నాం. అనుకున్నట్టుగానే 500 థియేటర్లలోనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం. రెండో వారంలో థియేటర్లు పెరిగే అవకాశం వుంది.
మీతోపాటు నాగచైతన్య, అఖిల్ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ ఐడియా ఎవరిది?
– చైతుకి, అఖిల్‌కి బంగార్రాజు క్యారెక్టర్ బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ పంచె కట్టుకున్నప్పుడు ముగ్గురం కలిసి ఓ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే ముగ్గురం కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాం. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అఖిల్ ఫస్ట్ మూవీకి వచ్చిన రిజల్ట్‌కి మీరెలా రియాక్ట్ అయ్యారు?
– చాలా బాధ అనిపించింది. వారం రోజులు అదే మూడ్‌లో వున్నాను. అఖిల్, వినాయక్, నితిన్ తమ తమ స్థాయిలో బాగా కష్టపడ్డారు. కానీ, కథని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం అనిపించింది. నా విషయానికి వస్తే ‘గీతాంజలి’ చేసే వరకు నా కెరీర్ ఎటు వెళ్తుందో అర్థంకాని పరిస్థితిలో వున్నాను.
ఆ తర్వాత నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే అఖిల్ తన మొదటి సినిమాకే రియలైజ్ అయ్యాడు. తన సెన్సిబిలిటీకి తగ్గ సినిమాలతో ఆడియన్స్‌ని మెప్పించేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు.
మీ నెక్స్ట్ మూవీస్?
– ‘ఊపిరి’ ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. ఈ సినిమాలో పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమయ్యే ఓ అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. కొన్ని కథలు కూడా వింటున్నాను. ఇప్పటివరకు ఏదీ ఫైనల్ చెయ్యలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు కింగ్ నాగార్జున.