ఈమధ్య రీ రిలీజ్ల హంగామా ఎక్కువగా కనిపిస్తోంది. పోకిరి, జల్సా, చెన్నకేశరెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వసూళ్లు మూటగట్టుకొన్నాయి. త్వరలోనే ప్రభాస్ – బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వబోతోంది. ఈ రేసులో ఇంద్ర సినిమా కూడా ఉంది. ఇప్పుడు `శివ` కూడా చేరబోతోంది. రీ రిలీజ్ ట్రెండ్ గురించి నాగార్జున మాట్లాడుతూ శివని రీ రిలీజ్ చేసే ఆలోచన ఉన్నట్టు పేర్కొన్నారు.
”శివని డిజిటల్లో రిలీజ్ చేద్దామనుకొంటున్నాం. ఆ ప్రోసెస్ జరుగుతోంది. కొన్ని రీల్స్ మిస్సయ్యాయి. వాటిని వెదికే పనిలో ఉన్నారు. శివ అనే కాదు… నా హిట్ సినిమాలు చాలా వరకూ రీ రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉంది. అయితే… కొన్నింటికి రీల్స్ దొరకడం కష్టమైపోయింది” అన్నారు నాగ్. ఆయన కథానాయకుడిగా నటించిన `ది ఘోస్ట్` రేపు (బుధవారం) విడుదల అవుతోంది. ఈ సినిమాపై నాగ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ”ది ఘోస్ట్ నాకు అన్ని రకాలుగా సంతృప్తి ఇచ్చింది. శివ సినిమా విడుదలైన రోజే.. ఘోస్ట్ కూడా వస్తోంది. ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని బలంగా నమ్ముతున్నా. టెక్నికల్ గా శివ గురించి ఎలా మాట్లాడుకొన్నారో… ఘోస్ట్ గురించి కూడా అలానే మాట్లాడుకొంటారు” అని చెప్పుకొచ్చాడు నాగ్.