వరుస ఫ్లాపుల తరవాత నాగార్జునకు `నా సామిరంగ`తో కాస్త జోష్ వచ్చింది. సంక్రాంతికి విడుదలైన ‘నా సామిరంగ’ అక్కినేని ఫ్యాన్స్‌ని సంతోష పెట్టడమే కాకుండా, నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఓటీటీ, శాటిలైట్ మంచి రేటుకి అమ్ముడయ్యాయి. విడుదలకు వారం రోజుల ముందు వరకూ ‘నా సామి రంగ’ వచ్చేది డౌటే. ఆఘమేఘాల మీద సినిమా పూర్తి చేయాల్సివచ్చింది. సంక్రాంతికి ఇన్ని సినిమాల మధ్య సినిమాని విడుదల చేయగలమా? అంటూ నిర్మాత సందేహిస్తున్న వేళ.. నాగార్జున ధైర్యం చేసి, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని రూ.15 కోట్లకు సొంతం చేసుకొన్నారు. ఒక్క రూపాయి కూడా అడ్వాన్సు తీసుకోకుండా అన్ని చోట్లా సొంతంగా విడుదల చేశారు.
ఇప్పుడు థియేటర్ నుంచి దాదాపుగా రూ.20 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే రూ.5 కోట్ల లాభమన్నమాట. ఓ వైపు ‘హనుమాన్’ మరోవైపు ‘గుంటూరు కారం’ వసూళ్లతో హోరెత్తుతోంటే, నాగ్ సినిమా ఈ రేంజ్లో వసూళ్లు తెచ్చుకోవడం, అందులోనూ తక్కువ థియేటర్లు ఉన్నప్పుడు పెట్టుబడి వెనక్కి తెచ్చుకోవడమే కాకుండా లాభాలు సాధించడం మామూలు విషయం కాదు. అందుకే నాగార్జున ఈ సినిమా ఫలితం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. త్వరలోనే చిత్రబృందానికి నాగ్ ఓ భారీ విందు ఇవ్వబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.