‘శివ’తో తెలుగు సినిమా స్థితి, గతి మార్చేశారు రాంగోపాల్ వర్మ – శివ. వీరిద్దరి కాంబోలో వచ్చిన అంతం, గోవిందా గోవిందా ఫర్వాలేదనిపించాయి. అయితే… శివ మార్క్ సినిమా మాత్రం రాలేదు. ఆ లోటు తీర్చడానికి వర్మ మరోసారి సిద్దమయ్యాడు. ఇటీవల నాగ్ని కలసి స్టోరీ ఐడియా చెప్పడం, నాగ్ వెంటనే ఇంప్రెస్ అయిపోవడం జరిగిపోయాయి. ”శివ కథ విన్న తరవాత ఎంత ఉత్సాహంగా అనిపించిందో.. ఇప్పుడు వర్మ కథ చెప్పినప్పుడు కూడా అంతే థ్రిల్ ఫీలయ్యా” అంటున్నాడు నాగ్. అన్నట్టు ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని నాగ్ వెల్లడించడం విశేషం. రియలిస్టిక్ సినిమాల్ని తీయడంలో సిద్దహస్తుడు వర్మ. ఈసారీ అలాంటి కథే తీసుకొన్నాడని తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అందరి మన్ననలు పొందిన ఓ వ్యక్తి జీవితాన్ని వర్మ పోట్రయిట్ చేయబోతున్నాడని సమాచారం. నాగ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన చాలా కాలం అయ్యింది. వర్మ కూడా పోలీస్ స్టోరీల జోలికి వెళ్లలేదు. కాబట్టి ఈ కాంబో కచ్చితంగా కొత్తగానే అనిపించొచ్చు. వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత కథని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆ తరవాతే.. నాగ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.