చిత్రసీమతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన విషయాలు చర్చకు వచ్చాయి. చిత్రసీమకు ప్రత్యేకమైన హామీలేం రాలేదు. కాకపోతే ఈ భేటీలో మాత్రం రేవంత్ రెడ్డి, నాగార్జున ములాఖాత్ ఓ మెరుపులా కనిపించింది. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్‌ని కూల్చివేసిన నేపథ్యంలో నాగ్ కీ, రేవంత్ రెడ్డికీ కొంత గ్యాప్ వచ్చింది. ఎన్ కన్వెన్షన్ వ్యవహారం ఇప్పటికీ కోర్టులోనే ఉంది. దాంతో పాటు సమంత విషయంలో కొండా సురేఖ చేసిన కొన్ని కామెంట్స్ నాగార్జునతో పాటు, ఆయన కుటుంబాన్నీ తీవ్రమైన మనస్థాపానికి గురి చేసింది. అంత జరిగినా రేవంత్ ఏమీ మాట్లాడకపోవడం నాగ్ ని ఇబ్బంది పెట్టింది. దాంతో ముఖ్యమంత్రి మీటింగ్ కు నాగార్జున వస్తారా, వస్తే రేవంత్ తో ఆయన ఎలా వ్యవహరిస్తారు? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది.
ఈ మీటింగ్ కి నాగ్ రారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా నాగార్జున కనిపించారు. రేవంత్ ని కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. నవ్వుతూ ఫొటోలు దిగారు. దాంతో నాగ్ – రేవంత్ రెడ్డిల ఎపిసోడ్ కు పుల్‌స్టాప్ పడినట్టు అయ్యింది. ఎన్.కన్వెన్షన్ కూల్చేశారు. ఆ వివాదం ఏమవుతుందో తెలీదు. కాకపోతే.. నాగ్ విషయంలో ఇకపై రేవంత్ రెడ్డి వైఖరి మారే అవకాశం ఉంది.
రాజకీయాల్లోనే కాదు, చిత్రసీమలోనూ శాత్వత మిత్రులు, శత్రువులు ఉండరు. పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉండాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఆ ప్రభుత్వంతో కలివిడిగా ఉండడం నాగార్జునకు అలవాటే. కాకపోతే రేవంత్ రెడ్డిని ఆయన లైట్ తీసుకొన్నారు. ఆ ప్రభావం ఎన్ కన్వెన్షన్ విషయంలో బయటపడింది. ఇకపై నాగ్ ఆ తప్పు చేయరేమో.