రాజుగారి గది రిజల్ట్‌పై నాగార్జునకు ఏమైనా అనుమానాలున్నాయా?? నాగ్ కంగారు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల పట్ల నాగార్జున కాస్త ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. వరుస విజయాల పరంపరకు ఓం నమో వేంకటేశాయతో బ్రేక్ పడిపోయింది. ఆ తరవాత వస్తున్న సినిమాకాబట్టి రాజుగారి గదిపై శ్రద్ద ఎక్కువైంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తయింది. ఈనెల 13న విడుదల కాబోతోంది. మేకింగ్ సమయంలో నాగ్ కాస్త అసంతృప్తి చెందినట్టు, కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయించినట్టు వార్తలొచ్చాయి. ఆతరవాత నాగార్జున మాటల్ని బట్టి అవన్నీ నిజమే అని తేలాయి. ఈ సినిమా ప్రమోషన్లకు నాగ్ తనంతట తానే శ్రీకారం చుట్టేశారు. చిత్రబృందం ప్రమేయంలేకుండానే తన సొంత పీఆర్వోలతో మీడియా ఇంటర్వ్యూలకు నాంది పలికారు నాగ్.
ఇప్పుడు ఈ సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ముద్ర పడడానికి తనవైపునుంచి ప్రయత్నాలు మొదలెట్టేశారు. రాజుగారి గది అనగానే హారర్ కామెడీ అనుకొంటారు. ఈ జోనర్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండదు. మాస్ లేదంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూడాలంతే. నాగ్బలం కుటుంబ ప్రేక్షకులే. ‘మీలో ఎవరు కోటీశ్వరు’ నుంచి నాగ్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా పెరిగింది. వాళ్లను థియేటర్లకు రప్పించాలంటే `క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్` అనే ట్యాగ్ ఇవ్వాల్సిందే. హారర్ కామెడీ ముద్రతో వస్తున్న రాజుగారి గదికి అదే మైనస్. దాంతో.. నాగ్ ఆ ముద్రని చెరిపి వేయాలని భావిస్తున్నారు. అందుకే ఇంటర్వ్యూలలో పదే పదే ‘ఇది హారర్ సినిమా కాదు… ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అని చెబుతూ వస్తున్నాడు. ఈ మాట విని కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు సరే, రాజుగారి గది లా… హారర్, కామెడీ మిక్స్ అయిన కథ అనుకొని థియేటర్లకు వెళ్లిన వాళ్ల పరిస్థితేంటి?? ఆ మాత్రం దానికి ఈ సినిమాకి రాజుగారి గది 2 అని ఆ పేరు వాడుకోవడం ఎందుకు..??