ఎన్నాళ్లనుంచో పెండింగ్ లో ఉన్న `బంగార్రాజు` ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు నాగార్జున. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ సినిమాకి ప్రధానమైన సమస్య.. మరో హీరో. నాగ్ తనయుడి పాత్రకు ఓ యువ హీరో కావాలి. ఆ పాత్రకు ముందు నుంచీ నాగచైతన్యనే అనుకుంటూ వచ్చారు. చైతూ ఓకే అంటే `బంగార్రాజు` కి సమస్యే ఉండకపోదును. కానీ.. చైతూ ఫుల్ బిజీ అవ్వడం మూలాన.. ఆ పాత్రకు మరో హీరోని వెదుక్కోవాల్సివచ్చింది. పరిశీలనలో చాలా పేర్లు ఉన్నా, ఇప్పటికి ఎవరూ ఖరారు కాలేదు.
నాగార్జునకు మాత్రం ఈ పాత్రని చైతూతోనే చేయించాలని వుంది. అందుకే చైతూపై నాగ్ ఒత్తిడి తీసుకొస్తున్నాడని సమాచారం. కాల్షీట్లు సర్దుబాటు చేసుకునైనా సరే, ఈ సినిమాలో నటించమని అడుగుతున్నాడట. నాగ్ బలవంతం చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ఇది అన్నపూర్ణ వారి సినిమా. మరో హీరో వచ్చి చేరితే.. పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది. చైతూ ఇంట్లో హీరో కాబట్టి, గొడవ ఉండదు. పైగా ఈ కథపై నాగ్ కి బాగా నమ్మకం కుదిరింది. చైతూ చేస్తే.. కాంబినేషన్ పరంగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడు నాగ్. ఇద్దరూ కలిసి నటించే కథలు అరుదుగా వస్తాయని, వచ్చినప్పుడు వదులుకోకూడదని… చైతూకి గట్టిగా చెబుతున్నాడట నాగ్.
అయితే ఈ విషయంలో చైతూ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చై చేతిలో `థ్యాంక్యూ` ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తో చేయాల్సిన సినిమా ఉంది. దాంతో పాటు మైత్రీ మూవీస్ కీ ఓకే చెప్పాడు చై. అందుకే… బంగార్రాజుకి కాల్షీట్లు కేటాయించలేకపోతున్నాడు.