సినిమా వాళ్ళంతేనేమో అని అనుకోవాల్సి వచ్చేలా ఉంది. సమయం వచ్చినప్పుడల్లా ఎన్నో విషయాలపైన మెస్సేజ్‌లు ఇస్తూ ఉంటారు. చాలా గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా మంచి మంచి మెస్సేజ్‌లు ఉండేలా చూసుకుంటారు. కానీ కాసులొచ్చే అవకాశం ఉందంటే చాలు….కంటెంట్ ఏంటి అనేదానితో సంబంధం లేకుండా సినిమా తీయడానికి రెడీ అయిపోతారు. సినిమా మీడియా అంటే వీళ్ళకు ఎంత గౌరవం ఉందో తెలియదు. కనీసం ఫిల్మ్ మీడియా ప్రభావం ప్రజల ఆలోచనలపైన ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం గురించి కూడా తెలుసో లేదో తెలియదు. ఉషోదయం అంటూ ప్రతి రోజూ ఉదయాన్నే తన పత్రిక ద్వారా ఎన్నో సందేశాలు అందించే రామోజీరావుగారు ‘చిత్రం’ లాంటి సినిమాను అందించినప్పుడు తెలుగు వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. మేధావులు, ఉపాధ్యాయ రంగంలో ఉన్నవాళ్ళు చాలా మంది చాలా బాధపడ్డారు. ఆ సినిమా వచ్చిన తర్వాత ఓ రెండు మూడేళ్ళ వరకూ కూడా కొంచెం ఆలోచన ఉన్నవాళ్ళతో ఎప్పుడు డిస్కషన్‌కి కూర్చున్నా కూడా సినిమా మీడియా గురించి టాపిక్ వస్తే ‘చిత్రం’ సినిమా గురించి, అలాంటి చీప్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన రామోజీరావు గురించి కచ్చితంగా చర్చ వచ్చేది. ఆ తర్వాత కూడా జయం, నువ్వు నేను సినిమాలతో యువత ఆలోచనలను చెడువైపుగా చాలా చాలా ప్రభావితం చేశాడు తేజ. ఆయన సినిమాలు హిట్ అవ్వడంతో కాసుల కోసమే కక్కుర్తిపడే బోలెడంత మంది క్రియేటివ్ పీపుల్(?) అందరూ కూడా అదే బాట పట్టారు. ప్రేక్షకులు ఛీ కొట్టేవరకూ అలాంటి చిత్రాలనే అందించారు.
ఇప్పుడిక నాగార్జున అంతకంటే ఓ అడుగు కిందకు జారాడు. కాన్వెంట్ పిల్లలతో లవ్ స్టోరీ తీసేశాడు. వాళ్ళకు కొత్త కొత్త ప్రేమ భాషను పరిచయం చేయడానికి బయల్దేరాడు. ఇరవై ఏళ్ళు దాటిన అమ్మాయిల చేత ఎక్స్పోజింగ్ చేయించడాన్ని విమర్శిస్తే అందరూ కూడా మనల్నే పిచ్చోళ్ళను చూసినట్టు చూసే పరిస్థితి. ఇక ఇఫ్పుడు నిర్మలా కాన్వెంట్ లాంటి సినిమాలు మరి కొన్ని వస్తే ఆ తర్వాత పసితనం పోని అమ్మాయిల చేత కూడా…….ఛ…ఛ…ఇక్కడ రాయడానికే మనసొప్పడం లేదు. ఆ అమ్మాయిది పసితనం. డబ్బులు బాగా వస్తాయని పేరెంట్స్ ప్రోత్సహించి ఉంటారు. తీసిన డైరెక్టర్‌కి ఏమైంది? ప్రొడ్యూస్ చేసిన నాగార్జునకు ఏమైంది? చూపించాల్సిన చెత్తంతా చూపించి, కాన్వెంట్ పిల్లల ఆలోచనలను చెడగొట్టి చివరలో మళ్ళీ మెస్సేజ్ ఒకటి. షకీలా సినిమాలు కూడా ఇలాగే తగలడతాయిగా. అలాగే ఈ సినిమా చూసిన అబ్బాయిలు ఎలా ఫీల్ అవుతారు? తెరపైన కనిపించే హీరోలు, వాళ్ళు పండించే హీరోయిజం అంటే అన్ని విషయాలపైన అవగాహన ఉన్నవాళ్ళకు కూడా ఓ ప్రత్యేకమైన మోజు ఉంటుంది. ఇక ఈ కాన్వెంట్ పిల్లాడి హీరోయిజాన్ని చూసి టీనేజ్ పిల్లలు ఎలా రియాక్టవుతారు? తెలుగు ప్రేక్షకుల అదృష్టం కొద్దీ సినిమా డిజాస్టర్ అయింది. కానీ రేపు మళ్ళీ ఇదే సినిమాను టివిలలో మళ్ళీ మళ్ళీ చూపిస్తారు. యూట్యూబ్‌లో కూడా చూసే అవకాశం కల్పిస్తారు. కాన్వెంట్ స్థాయి పిల్లందరికీ కూడా ఈ సిినిమా చూడాలనిపిస్తుంది. సినిమా చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడిప్పుడే కొంతమంది యువతరానికైనా ప్రేమ మీద ఉండే భ్రమలన్నీ తొలగిపోతున్నాయి. కెరీర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడిక చిన్న పిల్లల ప్రేమ కథలు తీసే ప్రయత్నం మాత్రం చేయకండి.
సినిమాలో ఉన్న చాలా సీన్స్‌ని చూస్తూ ఉన్నప్పుడు మన సినిమాలను సెన్సార్ చేస్తున్నారా? లేదా? అన్న అనుమానం వచ్చింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి, తీసిన అన్ని సినిమాలతోనూ ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం, సమాజ ఉన్నతి కోసం ప్రయత్నించిన ఆర్. నారాయణమూర్తి లాంటి గొప్ప వాళ్ళు తీసే సినిమాలకు మాత్రం మన సెన్సార్ వాళ్ళ కత్తెర మహా పదునుగా ఉంటుంది. కాన్వెంట్ లవ్ స్టోరీలకు, స్కూల్ పిల్లల రొమాంటిక్ కథలకు మాత్రం లంచాల మత్తులో నిద్దరోతుంది. ఎంతైనా అక్కడ ఉండేవాళ్ళందరూ రాజకీయ జీవులే కదా?