రాంగోపాల్ వర్మతో నాగార్జున సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. వరుస ఫ్లాపుల్లో ఉండి, తన ఇమేజ్ కోల్పోయిన వర్మకి నాగార్జున ఎలా అవకాశం ఇచ్చాడు? అంటూ నివ్వెరపోయారు. కానీ నాగ్ ధైర్యం వేరు, నాగ్ నమ్మకం వేరు. తన విజన్ వేరు. ట్రాక్ రికార్డుల్ని ఏమాత్రం పట్టించుకోని నాగార్జున – ఎప్పట్లా మరో సాహసం చేశాడు. ఈ ఆశ్చర్యంలోంచి, షాక్‌లోంచి తేరుకొనేలోగానే ‘ఆఫీసర్’ సినిమా ముస్తాబైపోయింది. శుక్రవారం విడుదలకు సిద్ధమైంది కూడా. ఈ సందర్భంగా నాగార్జునతో తెలుగు 360 చేసిన చిట్ చాట్..
* వరుస ఫ్లాపుల్లో ఉన్న వర్మకు ఏ ధైర్యంతో అవకాశం వచ్చారు?
– సోగ్తాడే చిన్ని నాయన సినిమాని ఏధైర్యంతో… కల్యాణ్ కృష్ణ చేతిలో పెట్టాను? ఆ సినిమా హిట్టయింది కదా? రిస్కులు నా జీవితంలో చాలా మామూలు. దర్శకుడిగా వర్మ ఏంటో నాకు తెలుసు. ఈమధ్య దారి తప్పాడు గానీ, తనకు మంచి టెక్నీషియన్లని ఇస్తే తప్పకుండా మంచి సినిమా తీయగలడు.
* శివ మీ జీవితానికి ఓ మైల్ స్టోన్. మరి ఆఫీసర్ ఏమవుతుంది?
– ఏమవుతుందో ఇప్పుడే చెప్పలేను. శివ తీసేటప్పుడు ఆ సినిమా ఆ స్థాయిలో నిలబడుతుందని ఎవ్వరం ఊహించలేదు. మేం నమ్మింది తీశాం. సినిమా పూర్తయ్యాక చూపిస్తే చాలామంది `యావరేజ్ అవుతుందేమో` అన్నారు. కామెడీ లేదు ఆడుతుందా? యాక్షన్ ఎక్కువైంది చూస్తారా? అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. ‘ఆఫీసర్’ మరోసారి మమ్మల్ని మేం నమ్ముకుని తీసిన సినిమా. రిజల్ట్ ఏంటన్నది జనాలు చెప్పాలి.
* ఈ సినిమా విడుదలకు ముందు కొన్ని వివాదాలు నడిచాయి. మీరేమైనా ఆందోళన చెందారా?
– వందో సినిమాకి దగ్గర పడుతున్నా. నాకు ఇలాంటి గందరగోళాలు, సమస్యలు మామూలే. ఇప్పటికే 65 శాతం లైఫ్ అయిపోయింది. మిగిలిన జీవితమైనా హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్నా. ఎక్కువగా ఆలోచిస్తే… ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది.
* ఈ సినిమా కోసం మిమ్మల్ని ఒప్పించడానికి వర్మ ఉత్తరం రాశాడన్నారు కదా? అందులో ఏముంది?
– ఒప్పుకున్న తరవాతే వర్మ ఉత్తరం రాశాడు. వర్మ కథ చెప్పినప్పుడు బాగానే ఉందనిపించింది. కానీ.. వర్మ దారి తప్పాడు. సినిమా కాకుండా వేరే విషయాలపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు తను చెప్పిన సినిమా చెప్పినట్టు తీయగలడా? అనిపించింది. అదే విషయం వర్మతో చెప్పా. ‘మనమిద్దరం బాగానే ఉన్నాం కదా? కలసి సినిమా చేయాల్సిందే అని ఎవ్వరూ తొందర పెట్టడం లేదు. అలాంటప్పుడు సినిమా తీయడం ఎందుకు? కావాలంటే ఎప్పట్లా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకుందాం’ అన్నాను. కానీ వర్మ వినలేదు. అందుకే ఓ లెటర్ రాశాడు. చెప్పింది చెప్పినట్టు తీయకపోతే.. తన్నమన్నాడు.
* వర్మ ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనిపించాయా? మారమని మీరేమైనా సలహా ఇచ్చారా?
– మారాల్సిన అవసరం ఏమిటండీ. ఎవరి జీవితం వాళ్లది. నేనేం ఎవ్వరికీ సలహాలు ఇవ్వను. మా అబ్బాయిలకే ఇలా ఉండండీ, అలా ఉండండీ అని చెప్పను. వర్మ వ్యక్తిగత జీవితం నాకు అవసరం లేదు. నా గురించి తనకు అవసరం లేదు. సమాజానికి చేటు చేయనంత వరకు ఎవరు ఎలాగైనా బతకొచ్చు. వర్మని తనకు ఇష్టమొచ్చినట్టు బతకనివ్వండి.
* పోనీ ఈ సినిమా మొదలెట్టేముందు మీరేమైనా షరతులు విధించారా?
– తన ఫోకస్ అంతా సినిమాపైనే పెట్టమని చెప్పానంతే. వర్మ మంచి టెక్నీషియన్. పోస్ట్ ప్రొడక్షన్ తాను దగ్గరుండి చూసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందనిపించింది.
* ఈ సినిమా చేయడానికి ముందు ఆఫీసర్లను కలిశారా, స్టడీ ఏమైనా చేశారా?
– లేదు. వర్మ ఏం చెప్పాడో అది చేశాను. నా వరకూ నేను వర్మ కళ్లతో ఈ సినిమా చూద్దామనుకున్నా. ఉన్నది ఉన్నట్టుగా తీయడం చాలా కష్టం.
ఉదాహరణకు ఇందులో ఓ ఆఫీసర్ని ఆరెస్ట్ చేసే సన్నివేశం తీశాం. వర్మ చాలా రియలిస్టిక్‌గా ఆసీన్ తీశాడు. తీసిన సీన్ చూసుకుంటే మాకే బోర్ కొట్టింది. లెంగ్తీగా అనిపించింది. దాంతో అరవై శాతం ఆ సీన్‌ని ట్రిమ్ చేశాం.
* యాక్షన్ కోసం చాలా కష్టపడినట్టున్నారు?
– అవును. క్లైమాక్స్ లో యాక్షన్ కి చాలా ప్రాధాన్యం ఉంది. వర్మ యాక్షన్‌ని వాస్తవానికి దగ్గరగా తీస్తాడు. అలాంటి ఫైట్లు జనం ఇష్టపడుతున్నారు కూడా. డూప్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వడు. ఎందుకంటే.. చుట్టూ ఆరు కెమెరాలు ఉంటాయి. ప్రతీ కదలికనూ ఫ్రేమ్ లో బంధిస్తాడు. అలాంటప్పుడు డూప్‌లను పెట్టలేం. క్లైమాక్స్‌ని ఓ బిల్డింగ్‌పైన తీశాడు. అక్కడన్నీ ఇనుపరాడ్లున్నాయి. షూట్ చేసేటప్పుడు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి.
* వందో సినిమాకి దగ్గర పడుతున్నారు కదా? ప్రత్యేకమైన సినిమా చేయబోతున్నారా?
– వందో సినిమా అనే మాట నా సౌలభ్యాన్ని బట్టి వాడుకుందాం అనుకుంటున్నా. సినిమా హిట్టయ్యిందనుకోండి.. అది నా వందో సినిమా అని ప్రకటిస్తా. లేదంటే… లేదు. మధ్యలో కొన్ని చిన్న చిన్న పాత్రలు చేశా కదా. దాన్ని కావాలనుకుంటే నా సినిమాల జాబితాలో కలుపుతా, లేదంటే తీసేస్తా… (నవ్వుతూ)
* నానితో మల్టీస్టారర్ ఎలా ఉండబోతోంది?
– రాజ్ కుమార్ హిరాణీ తరహా కథ ఇది. చాలా వినోదాత్మకంగా సాగుతుంది. నేను మాఫియా డాన్‌గా నటిస్తున్నా. షూటింగ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నా.
* మళ్లీ బుల్లి తెరపై మెరిసే అవకాశం ఉందా?
– సినిమాలతో బిజీగా ఉన్నా. కొంతకాలం మంచి సినిమాలు చేయాలని వుంది. టీవీ షోలు చేయొచ్చు. కానీ ఏదో కొత్తదనం కనిపించాలి. లేదంటే అటువైపు వెళ్లకూడదు.