2016 లో హిట్లు కొట్టిన జాబితాలో ఊపిరి సినిమా కూడా ఉంది. నాగార్జున – కార్తీలు నటించిన ఈ మల్టీస్టారర్ మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. `మా సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బ్లస్టర్ హిట్` అంటూ అటు హీరోలు, ఇటు దర్శక నిర్మాతలు మైకు పట్టుకొని కోడై కూశారు. ఇప్పుడు ఈ సినిమా అసలైన లెక్కలు బయటకు తీసింది చిత్రబృందం. ఊపిరితో తమ సంస్థకు అపారమైన నష్టం వాటిల్లిందని, దానికి దర్శకుడు వంశీ పైడిపల్లినే కారణమని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి రివర్స్ అయినట్టు టాలీవుడ్ టాక్. ఇందుకు సంబంధించి ఫిల్మ్చాంబర్లో కూడా ప్రసాద్ ఫిర్యాదు చేశారు. మహేష్ సినిమా ఎప్పుడైతే చేజారిందో.. అప్పుడు వంశీ పైడిపల్లి కూడా పీవీపీతో సినిమా చేయలేక బయటకు వచ్చేశాడు. ఈ నేపథ్యంలో పీవీపీ వంశీపైడిపల్లిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తెలుగు ఫిల్మ్ చాంబర్లో వంశీ పైడిపల్లిపై ఫిర్యాదు చేసింది పీవీపీ సంస్థ.
ఆ ఫిర్యాదులో ఊపిరి సినిమాకి సంబంధించిన లాభనష్టాల ప్రస్తావన వివరంగా ఉందట. ఈసినిమాకి దాదాపు గారూ.65 కోట్లు ఖర్చయ్యాయని, ఈ సినిమా మూలంగా తాను రూ.21 కోట్లు నష్టపోయానని ప్రసాద్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. రూ.40 కోట్లలో తీస్తానని దర్శకుడు మాటిచ్చాడని, తీరాచూస్తే రూ.65 కోట్ల బడ్జెట్ అయ్యిందని, సినిమా వల్ల తాను బాగా నష్టపోయానని ఇప్పుడు దానికి దర్శకుడు కూడా బాధ్యత వహించాలని ఆ ఫిర్యాదులో క్లియర్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఊపిరి వల్ల నష్టాల్ని కవర్ చేయాలన్న ఉద్దేశంతోనే తన సంస్థలో మరో సినిమా చేస్తానని వంశీ పైడిపల్లి మాట ఇచ్చాడని, ఇప్పుడేమో ఆ ప్రస్తావన తీసుకురావడం లేదని, ఆరు నెలలు తన ఆఫీసులో కూర్చుని రాసుకొన్న కథని తీసుకెళ్లి… మహేష్ తోనే మరో సంస్థలో సినిమా తీయడంలో న్యాయం లేదని, ఆ కథపై సర్వహక్కులూ తమ సంస్థవే అని పీవీపీ వాదిస్తున్నట్టు సమాచారం.
ఈ వ్యవహారం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకులు – నిర్మాతల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదో తార్కాణం మాత్రమే. మా సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ నిర్మాతలు, దర్శకులు ప్రకటించుకోవడం అంతా అంబక్లానే తోస్కోంది. అసలు లెక్కలు తిరగేస్తే.. ఇవిగో ఇలాంటి చేదు నిజాలే దర్శనమిస్తుంటాయి.