ఈ రోజుల్లో ఒక పెద్దహీరో సినిమా విడుదలకు సిద్ధం కావాలంటే పీప్రొడక్షన్ పక్కన పెడితే.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కలుపుకొని తక్కువలో తక్కువ ఆరు నెలలకు పైమాటే. కానీ నాగార్జున మూడు నెలల్లో ‘నాసామిరంగ’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం ఆయన నాన్ స్టాప్ గా దాదాపు అరవై రోజులు పని చేశారు. టీం అంతా రాత్రింబవళ్లు పని చేసింది. ఎలాగైనే సినిమాని సంక్రాంతికి విడుదల చేయలనే పట్టుదల, ఆరాటంలోనే ఇంత త్వరగా పూర్తి చేశారు. ఈ సినిమా విషయంలో నాగార్జున ఎందుకంత ఆరాటపడ్డారో ‘నాసామిరంగ’ చూస్తే అర్ధమౌతుంది. నాగార్జున ఆరాటంలో అర్ధముందనిపిస్తుంది.
మలయాళ చిత్రం పొరింజు మరియం జోష్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పొరింజు మరియం జోష్ చర్చి ఫెస్టివల్ నేపధ్యంలో సాగే పిరియడ్ డ్రామా. తెలుగులో ఈ మొత్తం నేపధ్యాన్ని సంక్రాంతికి మర్చారు. కథ మొత్తం భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజుల్లోనే జరుగుతుంది. ఈ బ్యాక్ డ్రామా బాగానే కుదిరింది. ప్రేక్షకులు పండగ మూడ్ లో వున్నారు. సినిమా చూస్తున్నపుడు ఆ వైబ్ కనెక్ట్ అవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు సానుకూలంగానే స్పందిస్తున్నారు. కారణం.. పండగ వాతావరణం అలాంటింది.
నిజానికి ఈ సినిమా ఇప్పుడు కాకుండా మరో సమయంలో వచ్చివుంటే ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చే ఛాన్స్ వుండేది. నాగార్జున ఆరాటం కూడా ఇదే. విడుదల చేస్తే పండక్కి చేయాలి. లేదా అసలు ఈ సినిమానే చేయకూడదని భావించారట నాగ్. అనుకున్నట్లే సంక్రాంతి విడుదల చేసిన ఆయన ఊహించిన ఫలితాన్నే అందుకున్నారని చెప్పాలి. తొలి రోజుతో పోలిస్తే.. రెండో రోజు వసూళ్లు బాగున్నాయి. మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగే అవకాశాలు వున్నాయి.