బరిలో రెండు సినిమాలున్నప్పుడు.. రెండింటికీ మంచి టాక్ నడుస్తున్నప్పుడు… ఒకరి సినిమా గురించి మరొకరు పొగడ్డం.. నిజంగా గ్రేటే. ఈవారం విడుదలైన సినిమాల్లో చిలసౌ, గూఢచారి మంచి రేటింగులు తెచ్చుకున్నాయి. టాక్ పరంగా రెండూ బాగానే ఉన్నప్పటికీ.. గూఢచారికి వసూళ్లు బాగున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ కావడంతో.. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్లోనూ… ‘గూఢచారి’ ‘చిలసౌ’ని దాటేసి వెళ్లిపోతోంది. ఈ దశలో.. నాగ్ ట్వీట్.. `చిలసౌ`ని మరింత ఇబ్బందుల్లో నెట్టింది. గూఢచారి సినిమా బాగుందంటూ.. నాగ్ ట్వీట్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన ‘చిలసౌ’ కి పోటీగా రంగంలోకి దిగింది `గూఢచారి`. ఈ దశలో తన ప్రమోషన్లతో `చిలసౌ`ని కాస్త బయటకు లాగే ప్రయత్నం చేయాల్సిన నాగ్… నిజాయతీగా, నిస్పక్షపాతంగా ‘గూఢచారి’ని మెచ్చుకోవడం ‘చిలసౌ’ చిత్రబృందాన్ని ఓ విధంగా ఇబ్బందుల్లోకి నెట్టింది. నిజానికి ఇందులోనూ నాగ్ కాస్తో కూస్తో స్వార్థంగా ఆలోచించాడు. ‘గూఢచారి’లో సుప్రియ నటించింది. చాలా కాలంగా అన్నపూర్ణ వ్యవహారాలు, నాగార్జున వ్యక్తిగత విషయాలూ దగ్గరుండి చూసుకుంటోంది సుప్రియ. అందుకే… సుప్రియ నటించిన సినిమా కాబట్టి.. నాగ్ ఈ రకంగా ప్రమోషన్ చేశాడేమో.