కింగ్ నాగార్జున, కార్తి లీడ్ రోల్ లో తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా ‘ఊపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా తమిళ ఆడియో నిన్న చెన్నైలో అట్టహాసంగా జరిగింది. సినిమాలో కలిసి నటించిన కార్తి గురించి మెచ్చుకున్న నాగ్ తన సోదరుడు సూర్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.
తమిళ్ లో ‘తోజా’ అనే టైటిల్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియోకి ముఖ్య అతిథిగా వచ్చారు హీరో సూర్య. ఇక సూర్య గురించి మాట్లాడిన నాగ్ తనకు నచ్చిన చాలా తక్కువ హీరోల్లో సూర్య ఒకరని.. తను నటించిన గజిని సినిమా నుండి తనని అభిమానించడం మొదలు పెట్టానని అన్నారు. సూర్య కేవలం తమిళ నటుడు, హీరోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్య చాలా పెద్ద స్టార్ అని కొనియాడారు.
తమిళ సూర్య అభిమానులను బుట్టలో వేసుకునే క్రమంలో నాగ్ సూర్య గురించి పై విధంగా గొప్పగా మాట్లాడటం జరిగింది. అయితే తానో పెద్ద స్టార్ హీరో అయ్యుండి తన కన్నా వయసులో, అనుభవంలో చిన్న వాడైన హీరో సూర్య గురించి నాగార్జున పొగడటం అందరిని ఆశ్చర్యంలో ముచెత్తడమే కాకుండా మరోసారి నాగ్ మంచి తనాన్ని బయటపడేలా చేసింది.