నాగార్జున ఎందుకో ఈమధ్య స్పీడు తగ్గించాడు. సోలో హీరోగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. తన చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. రెండూ మల్టీస్టారర్లే. కూలీ, కుబేర సినిమాల్లో నాగ్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. తన బ్యాచ్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలయ్య సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటే, నాగ్ మాత్రం మీనమేషాలు లెక్కేస్తున్నాడు. అయితే నాగ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ కథని ఓకే చేశాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. `డబుల్ ఇస్మార్ట్` తరవాత పూరి చేయబోయే సినిమా ఏమిటన్న విషయంలో ఓ క్లారిటీ రాలేదు. గోపీచంద్ తో ఓ సినిమా చేస్తాడని టాక్ వినిపించింది. కానీ అది కేవలం ఊహాగానమే అని తేలిపోయింది. నాగ్ తో పూరి ఫిక్సయితే ఇది వారిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ అవుతుంది. సూపర్, శివమణి చిత్రాలు వీళ్ల కాంబోలో వచ్చాయి. అయితే అవి రెండూ హిట్లు కావు. యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయాయి. ఈసారి మాత్రం నాగ్ కి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత పూరిపైనే వుంది.
నాగార్జున ఈమధ్య కొన్ని కథలు విన్నా, ఎందుకే ధైర్యం చేయడం లేదు. పూరిపై తనకు నమ్మకం వుంది. నాగ్ కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకొనే వీలు దక్కుతుంది. మార్కెట్ పరంగానూ ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ ఏర్పడుతుంది. పూరికి కూడా ఇంతకు మించిన ఆప్షన్ లేదు. అగ్ర హీరోల్లో ఇప్పుడు ఖాళీగా ఉంది నాగ్ ఒక్కడే. కాబట్టి… నాగ్ తో ప్రొసీడ్ అయిపోవడం మంచిదే. కాకపోతే ఇది వరకటిలా స్క్రిప్టు విషయంలో లైట్ తీసుకోకూడదు. ఈసారి లెక్క తప్పితే – పూరి కెరీర్ దాదాపు డెడ్ ఎండ్ కి వచ్చేసినట్టే. పూరి కి కూడా ఆ విషయం తెలుసు. అందుకే కథ విషయంలో తాను మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంటున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.