హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అన్ని న్యూస్ ఛానల్స్‌కు, దినపత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు నిన్న సాక్షి టీవీలో ఒక అనుకోని అనుభవం ఎదురయింది. సాక్షి టీవీలో లైవ్‌లో కేటీఆర్ ప్రజలతో మాట్లాడుతుండగా మధ్యలో నాగార్జున లైన్లోకి వచ్చారు. తన తాజా చిత్రం సోగ్గాడే చిన్న నాయనా చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా పైరసీని అరికట్టాలంటూ కేటీఆర్‌ను అభ్యర్థించటానికి సాక్షి లైవ్ షోను నాగార్జున వేదికగా మలుచుకున్నారు. పైరసీ తెలుగు ఇండస్ట్రీని బాగా బాధపెడుతోందని, అది ఇండస్ట్రీలోని వారికి మాత్రమేకాక, పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను రానీయకుండా చేస్తోందని చెప్పారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దానితోపాటు కొంతకాలంగా మీడియాలో గమనిస్తూ వస్తున్నానని, మంత్రిగా, పార్టీ నేతగా బాగా పనిచేస్తున్నారంటూ కేటీఆర్‌ను మెచ్చుకున్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, తాను నాగార్జున శివ, గీతాంజలి వంటి చిత్రాలు చూస్తూ పెరిగినవాడినని, ఆ సినిమాలకు తాను పెద్ద అభిమానని చెప్పారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నానంటూ శుభాకాంక్షలు తెలిపారు. పైరసీని అరికట్టటానికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.