ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పుకార్లు హల్ చల్ చేశాయి. అక్కడక్కడ నాగ్‌కి కొన్ని సీన్లు నచ్చలేదని, నాగ్ అసంతృప్తి కారణంగానే రీషూట్లు చేశారని, అందుకే ఈ సినిమా ఆలస్యమైందని చెప్పుకొన్నారు. ఇప్పుడు నాగ్ మాటలు వింటుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. రాజుగారి గది 2 ట్రైలర్ విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… ”షూటింగ్ అంతా సరదాగా సాగింది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అని ఉండేది. అప్పుడప్పుడూ ఓంకార్ నన్ను ఏడిపించాడు. అది మినహాయిస్తే.. అంతా సవ్యంగా సాగింది. నేనేం ఓంకార్‌మీద కంప్లైంట్ చేయడం లేదు… ఎవరేం చేసినా సినిమా బాగా రావడం కోసమే” అన్నాడు నాగ్.
ఈ సినిమా కోసం నాగార్జున కొంత హౌం వర్క్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. కేరళలోని ఓ వ్యక్తి కి ఎదుటివాళ్ల మనసులో ఏముందో పసిగట్టే శక్తి ఉందని, అతన్ని స్ఫూర్తిగా చేసుకొనే తన పాత్రని డిజైన్ చేశారంటున్నాడు నాగ్. ఆ వ్యక్తిని కూడా నాగ్ కలిశాడట. ”మీ మనసులో నాలుగు పదాలు అనుకోండి.. అవేంటో చెబుతా” అని నాగ్‌కే ఓ పరీక్ష పెట్టాడట. నాగ్ ఆ నాలుగు పదాల్ని అనుకోవడం, ఆ వ్యక్తి అవేంటో చటుక్కున చెప్పేయడంతో నాగ్ ఆశ్చర్యపోయాడట. ”మనసులో ఏముందో కనిపెట్టే మనుషులు ఉన్నారు. అందులోంచే నా పాత్ర పుట్టుకొచ్చింది.రాజుగారి గది 2లో నేనేం గెస్ట్ రోల్ కాదు.. ఇది నా సినిమా” అంటూ అభయం ఇచ్చాడు నాగ్.