ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. సెట్స్‌పై ఉండగానే అలాంటి ఆలోచనలు మొదలైపోతున్నాయి. ‘దేవదాస్’ సినిమాకి సీక్వెల్ చేయాలని నాగార్జున ఆశ పడుతున్నాడు. కంటెంట్ అంతగా నచ్చో, మరోటో కాదు. నానితో మళ్లీ పనిచేయాలనిపించి. ఈ విషయాన్ని నాగ్ స్వయంగా చెప్పాడు. ”మల్టీస్టారర్ చేస్తే నానితోనే చేయాలి” అని నాగార్జున ఎప్పుడో అనుకున్నాడట. అది `దేవదాస్`తో తీరిపోయింది. ”నేను అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. గట్టిగా అనుకుంటే అవి కచ్చితంగా జరుగుతుంటాయి. నానితో మల్టీస్టారర్ చేయాలని గట్టిగా అనుకున్నా. జరిగిపోయింది. నాని నాకు చాలా ఇష్టమైన నటుడు. డైలాగులు బాగా చెబుతాడు. అతని డైలాగులు వింటుంటే పాట వింటున్న పీలింగ్ కలుగుతుంది. తనకోసం దేవదాస్కి సీక్వెల్ చేయాలని వుంది” అన్నాడు నాగార్జు. వెండి తెరపై నాగ్, నానిల కెమిస్ట్రీ చక్కగా కుదిరిపోయిందని ట్రైలర్, టీజర్ చూస్తుంటే అర్థమైపోతోంది. ఆ కెమిస్ట్రీ పండి.. సినిమా కూడా సూపర్ హిట్టయిపోతే.. ‘దేవదాస్’ సీక్వెల్ రావడం ఖాయం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక కథానాయికలుగా నటించారు. 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.