నాగార్జునతో వర్మ ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి అప్పట్లో షాకే. ఆ ప్రకటన రావడం ఆలస్యం… సినిమా మొదలైపోయింది. నాగార్జునకి వర్మ ఏం చెప్పి ఒప్పించాడా? అనే సందేహం నెలకొంది. దాని వెనుక రహస్యం ఇప్పుడు బయటపడిపోయింది. ఈ సినిమా మొదలెట్టేముందు నాగార్జునకు వర్మ ఓ బాండ్ లాంటి లెటర్ రాశాడట. అందులో తాను ఏం ఏం అనుకుంటున్నాడో, ఈ సినిమాని ఎలా తీద్దామనుకుంటున్నాడో పూస గుచ్చినట్టు రాసిచ్చాడట. అంతేకాదు.. ఇవన్నీ తప్పితే… నన్ను తన్నండి అంటూ తన్నాల్సిన ప్లేసు కూడా రాసేశాడట. ఇదంతా ‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ వేడుకలో నాగ్ చెబితే తెలిసింది. ఆ లెటర్లో కొన్ని బూతు మాటలు కూడా రాశాడని, అందుకే ఇక్కడ చదవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు నాగ్ మరి తన్నడం ఖాయమా అంటే..? ‘తన్నాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే వర్మ చిత్త శుద్దితో ఈ సినిమా తీశాడు’ అంటూ కాంప్లిమెంట్ ఇస్తూ, వర్మ కంగారుని తగ్గించేశాడు. ‘శివ’ విడుదలయ్యాక సౌండ్ గురించి అంతా ఆసక్తిగా మాట్లాడుకున్నారని, ఆ తరవాత మళ్లీ మరో సినిమా గురించి మాట్లాడుకోవడం తాను వినలేదని, ఆపీసర్ సౌండ్ గురించి జనాలు మళ్లీ మాట్లాడుకుంటారని కితాబు ఇచ్చాడు నాగ్. చివరి 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోయాయట. అవన్నీ బ్రూస్లీ, రాంబో, సిల్వస్టోన్ స్టాలిన్ సినిమాల్ని గుర్తు చేస్తుందని చెప్పుకొచ్చాడు.