పరిశ్రమలో టాలెంట్ ఎంత ఉన్నా దానికి తగ్గ అవకాశాలు మాత్రం దొరకవు. కాని టాలెంట్ ఉంది అని తెలిస్తే వారిని ఎలాంటి భేషజాలు లేకుండా ఎంకరేజ్ చేసే స్టార్ హీరో కింగ్ నాగార్జున. తెలుగు సినిమా పరిశ్రమ దశదిశలల్లా వ్యాపించడానికి కారణమైన మూలస్థంభాల్లో ఒకడైన నాగార్జున ఎప్పుడు ప్రయోగాలను చేయడంలో ముందుంటాడు. ఇక కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
తన కెరియర్ లో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి 7 సార్లు సక్సెస్ అయ్యాడు నాగార్జున. అందులో మొదటిగా చెప్పాల్సి వస్తే వర్మ గురించి మాట్లాడాలి. శివ సినిమాతో వర్మ సృష్టించిన సంచలనం అలాంటి ఇలాంటిది కాదు. ఇక ఆ తర్వాత వర్మ సినిమాల గురించి మనం చెప్పాల్సిన పనిలేదు. ఆ కోవలోనే ఎదురులేని మనిషి (జొన్నలగడ్డ శ్రీనివాస్), నువ్వు వస్తావని (వి.ఆర్. ప్రతాప్), నిన్నే ప్రేమిస్తా (ఆర్.ఆర్.షిండే), సంతోషం (దశరథ్), మాస్ (రాఘవేంద్ర లారెన్స్) సినిమాలతో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి సూపర్ సక్సెస్ కొట్టాడు నాగార్జున.
ఇప్పుడు తాజాగా మరో కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు మన టాలీవుడ్ సోగ్గాడు నాగార్జున. కథ కథనాలను బలంగా నమ్మే నాగార్జున కొత్తగా పరిశ్రమకు పరిచయం కాబోయే దర్శకుల మీద నమ్మకంతో వారికి అవకాశాలు ఇవ్వడం వారితో సినిమాలు తీసి విజయ బావుటా ఎగుర వేయడం మాములే. అలా చేసిన చాలా సినిమాల్లో నాగార్జున 7 సినిమాలను సక్సెస్ బాట పట్టించడం జరిగింది.