టాలీవుడ్లో ఓ సరికొత్త కాంబో రాబోతోంది. ‘కింగ్’ నాగార్జున ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని నాగ్ చూచాయిగా చెప్పాడు. ”రజనీకాంత్ కోసం ధనుష్ ఓ కథ తయారు చేశాడు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కదా. అందుకే ఈ కథని నాతో చేయాలనుకుంటున్నాడు” అంటూ ఈ ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చాడు నాగ్. ‘ఆఫీసర్’ తరవాత వైజయంతీ మూవీస్ సినిమాతో బిజీ కానున్నాడు నాగ్. ఈ సినిమా మినహాయిస్తే… నాగ్ ఒప్పుకున్న సినిమాలేం లేవు. ”కథలు చాలా వస్తున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ కథ వినిపించారు. మోహన్‌లాల్ ఇందులో మరో కథానాయకుడు. ఆ కథ చాలా బాగుంది. బహుశా… ఆ సినిమాకి ఓకే చెప్పొచ్చు. ‘బంగార్రాజు’ సినిమా చేయాలని వుంది. అదెప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి” అంటున్నాడు నాగ్. వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆఫీసర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది.