విషాదాంతమయ్యే కథానాయకుల పాత్రల్ని మన తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా అంగీకరించరు. ముఖ్యంగా అభిమానుల సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి. హీరో పాత్ర చనిపోవడమనేది సినిమా విజయంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో మన దర్శకరచయితలు సాధ్యమైనంతవరకు అలాంటి ట్రాజెడిక్ క్లైమాక్స్‌లకు దూరంగా ఉంటారు. అయితే నాగార్జున తాజా చిత్రం దేవదాస్‌లో నాగార్జున పాత్ర చివరకు విషాదాంతంగా ముగుస్తుందని సమాచారం. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున, నాని కలిసి నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాగార్జున డాన్ పాత్రలో, నాని ఆర్.ఎం.పీ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. వినోదం, సెంటిమెంట్ అంశాలతో భావోద్వేగాలతో సాగే ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు ట్రాజిక్ ముగింపునిచ్చారని తెలియడం అభిమానుల్ని కలవరపరుస్తున్నది. ఈ సినిమాలో పవర్ఫుల్డాన్గా మొదలై అనుకోని సంఘటనల వల్ల ఉదాత్తమైన వ్యక్తిగా నాగార్జున పాత్ర పరివర్తన చెందుతుందని, కథానుగుణంగా విషాదాంతమైన ముగింపే సరియైనదని దర్శకుడు భావించాడని చెబుతున్నారు. మరి ఈ ట్రాజెడీ ఎండింగ్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో సినిమా విడుదలయ్యాక కానీ తెలియదు. గతంలో అంతం, నిన్నే ప్రేమిస్తే చిత్రాల్లో నాగార్జున పాత్ర విషాదాంతంగా ముగుస్తుంది. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా పరాజయం చెందాయి.