ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ పి.రాజశేఖర్ తీరు.. వివాదాస్పదమవుతోంది. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అజెండాను.. . సొంత అజెండాగా మార్చుకుని … పని చేస్తున్నారు. వైస్ చాన్సలర్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి… వైసీపీ విధానాలను బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో… వైసీపీ రంగులున్న ప్లకార్డుతో పాల్గొనడం మాత్రమే కాదు.. ఏకంగా… యూనివర్శిటీలోనే మూడు రాజధానులకు మద్దతుగా … సెమినార్ కూడా ఏర్పాటు చేశారు. నలుగురు విద్యార్థులు జై అమరావతి అని నినాదాలు చేసినందుకు వారిని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసేశారు. తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఆయన ఇతర విషయాల్లో ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇన్ చార్జ్ వీసీగా ఉన్న ఆయన… జగన్మోహన్ రెడ్డి కరుణాకటాక్షాల కోసం… ఓవరాక్షన్ చేస్తున్నారన్న అభిప్రాయం.. యూనివర్శిటీ వర్గాల్లో ఉంది. సాధారణంగా.. క్యాంపస్లలో.. ఏ రాజకీయ నేతల విగ్రహాలు పెట్టరు. కానీ… ఈ వీసీ మాత్రం.. వైఎస్ విగ్రహాన్ని పెట్టేశారు. దాని కోసం అన్ని రకాల నిబంధనలు కాలరాశారు. ఎవరూ నోరు ఎత్తలేని పరిస్థితి కల్పించారు. వైఎస్ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రభుత్వ ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేయడంతో.. ఇతర ప్రోఫెసర్లు, విద్యార్థులు కూడా సైలెంటయిపోయారు. అప్పట్నుంచి మరింత దూకుడుగా ఆయన వైసీపీ అజెండాను అమలు చేస్తున్నారు.
యూనివర్శిటీల చరిత్రలో ఎంతో మంది మేధావులు, నిపుణులు వీసీలు అయ్యారు. వారంతా.. ఆయా యూనివర్శిటీల ప్రమాణాలు పెంచడానికి తమ వంతు కృషి చేశారు కానీ.. తమకు ఆ పదవి ఇచ్చిన పార్టీకి పని చేయాలని అనుకోలేదు. కానీ.. ప్రస్తుత ఏఎన్యూ వీసీ మాత్రం.. అదేదారిలో వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ వీసీ పోస్టును .. పర్మినెంట్ వీసీగా మార్చుకునే టార్గెట్ తోనే ఆయన ఈ పనులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఆయన దేన్నీ లెక్క చేసే మూడ్లో లేరు.