”శ్రీరామ్ ఆదిత్య రెండు రోజుల క్రితమే ఈ సినిమా చూపించాడు. ఇంకాస్త ముందు చూపించి ఉంటే… మాకు చేతనైన మార్పులు చేర్పులూ చేసి ఈ సినిమాని ఇంకాస్త బెటర్‌గా తీసుకొద్దుము`” అని ఓ స్టేట్మెంట్ విసిరాడు నాగార్జున. ఈ ఒక్క మాట… `దేవదాస్`పై ఉన్న పాజిటీవ్ బజ్‌కి జర్క్ వచ్చేలా చేసింది. నాగ్ ఇలా మాట్లాడాడేంటి? అంటూ చిత్రబృందంలోని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మాటలకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కూడా కాస్త కినుక వహించాడు. అయితే ఇప్పుడు నాగ్ నష్టనివారణా చర్యలు చేపట్టాడు. తన తాజా ట్విట్ లో దేవదాస్ చూశాను. ఓ హిట్ సినిమాని జేబులో వేసుకుని… హాలీడేస్‌కి వెళ్తున్నా అంటూ రాసుకొచ్చాడు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన వైజయంతీ మూవీస్‌కీ, తనతో పాటు పని చేసిన నానీకి, ఈ సినిమా తీసిన దర్శకుడికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఓ విధంగా నిన్నటి కామెంట్‌కి ఇది ఆయింట్మెంట్ రాయడం లాంటిదే. నాగ్ ఈ సినిమా ఇప్పుడు చూడడమేంటి? మొన్నే చూశా.. అని తానే స్వయంగా చెబితే? అప్పటికీ, ఇప్పటికీ ఈ సినిమాలో వచ్చిన మార్పేంటో నాగార్జునకే తెలియాలి. ఓ సినిమా విడుదలకు ముందు కాస్త నెగిటీవ్‌గా మాట్లాడడం.. సినిమాకే కాదు, ఆ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లకూ ఇబ్బంది తెచ్చి పెడుతుంది. ఆ తరవాత ఇలాంటి కవరింగులు ఎన్ని చేసినా లాభం లేదు. మరి నాగ్ ట్వీట్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగితే సరిపోతుంది.