కేవలం పండగని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన సినిమా నాగార్జున నా సామిరంగ. యుద్ధ ప్రాతిపదికన అన్నట్టు ఈ సినిమాని పండగ విడుదల సిద్ధం చేశారు. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. ‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అనే మాట అడుగడుగునా ధ్వనించేలా ట్రైలర్ ని కట్ చేశారు. ‘నా సామి రంగ’ మలయాళంలో హిట్టయిన ‘పొరింజు మరియమ్ జోస్’కి రీమేక్. తెలుగులో వచ్చేసరికి కొన్ని నేటివిటీకీ అనుగుణంగా మార్పులు చేసినట్లు ట్రైలర్ కనిపిస్తోంది. కోనసీమ ప్రభల తీర్ధం నేపధ్యాన్ని ప్రధానంగా తీసుకొని ఈ కథని మలిచినట్లుగా వుంది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకూ పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పాలి.
కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా వున్నాడా అసలు? అని అల్లరి నరేష్ వాయిస్ తో నాగార్జున యాక్షన్ ఎంట్రీతో ట్రైలర్ ని మొదలుపెట్టారు. తర్వాత కిష్టయ్యలోని రొమాంటిక్ యాంగిల్ ని ప్రెజంట్ చేశారు. ఇందులో నరేష్, రాజ్ తరుణ్ కి కూడా ప్రత్యేక కథలు వున్నాయి. ఈ ముగ్గురు పాత్రలకు వున్న ముడి ఏమిటి ? కోనసీమ ప్రభల తీర్ధం ఈ కథలో తెచ్చిన వైరం ఏమిటి ? అనేది తెరపై చూడాలి.
ట్రైలర్ లో మాస్ మసాలా అంశాలని బాగానే దట్టించారు. నాగార్జున మాస్ లుక్, స్టయిల్ బావుంది. అల్లరి నరేష్ పాత్రకి కూడా ప్రాధన్యత వున్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, నేపధ్య సంగీతంలో ఫెస్టివల్ వైబ్ కనిపిస్తోంది. పండగ నాగార్జున కి కలిసొచ్చిన సీజన్. మరి ఈసారి పండక్కి నా సామిరంగ ఎలా వుంటుందో చూడాలి.