నాగార్జున సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకొని చాలా కాలమైంది. ఆయన గత సినిమాలు ఆఫీసర్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్… ఇలా అన్నీ ఫ్లాపులే. సంక్రాంతి సీజన్లో రావడం వల్ల `బంగార్రాజు` గట్టెక్కేసింది. ఇప్పుడాయన… `ది ఘోస్ట్` అవతారం ఎత్తారు. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. షూటింగ్ దాదాపుగా పూర్తయింది. అయినా సరే, సినిమాపై ఎలాంటి బజ్జూ రాలేదు. అందుకే ఇప్పుడు ప్రమోషన్లు మొదలెట్టారు. నిజానికి ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరిగింది. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు ఇప్పుడు ఆశాజనకంగా లేవు. బడా స్టార్ సినిమాలకు సైతం చుక్కెదురు అవుతోంది. అందుకే ఘోస్ట్ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొన్నారని ప్రచారం జరిగింది. యఇతే… ఇదంతా ఉత్తినే అని తేలిపోయింది. ఈ సినిమాని నేరుగా థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రబృందం స్పష్టం చేసింది. ఇప్పుడు విడుదల తేదీ కూడా ప్రకటించేసింది. అక్టోబరు 5న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. `శివ` విడుదల తేదీ ఇది. నాగార్జున కెరీర్నే కాదు, తెలుగు సినిమా ఒరవడినే మార్చేసింది. అలాంటి మహత్తరమైన తేదీన… నాగార్జున తన ఘోస్ట్ ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు కొత్తగా ఉంటాయని, అందుకోసం తాను ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకొన్నానని నాగ్ చెబుతున్నారు. తగ్గించిన రేట్లకే టికెట్ ని అమ్ముతామని నిర్మాతలు ప్రకటించేశారు. మరి ఘోస్ట్ జాతకం ఎలా ఉంటుందో చూడాలి.