నాగార్జునసాగర్‌లోకి నిండుగా నీళ్లు వచ్చి ఐదేళ్లవుతోంది. 2013లో సాగర్ నిండటంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మళ్లీ అ అవసరం లేదు. ఈ ఏడాది మాత్రం.. ఎగువ ప్రాంతాల్లో దండిగా వర్షాలు పడటంతో.. ఆగస్టు చివరి నాటికే నాగార్జునసాగర్ నిండిపోయింది.
పది రోజుల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు రోజుకు పది టీఎంసీల నీరు వస్తోంది. ఇప్పటికే ఎడమ, కుడి కాలువలకు నీటి విడుదలను ప్రారంభించారు. జల విద్యుత్ ఉత్పాదనను కూడా చేపట్టారు. నాలుగేళ్ల నుంచి పంటలు వేసుకోలేకపోయిన కుడి కాల్వ రైతులు ఈ సారి నారుమళ్లు ప్రారంభించారు. కుడి కాలువ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని జోన్ -1, జోన్ -2 పరిధిలో ఖరీఫ్ లో వరి పంట వేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది.
సాగర్ నుంచి విడుదల చేసే నీటిని పులిచింతల వద్ద నిలువ చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. నల్గొండ జిల్లాలోని పులిచింతల ముంపు ప్రాంతాలకు నష్ట పరిహారం చెల్లించడంతో ఈ ఏడాది పులిచింతల రిజర్వాయర్ లో 42 టీఎంసీల వరకు నీటిని నిలువ చేయాలని నిర్ణయించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పులిచింతల రిజర్వాయర్ లో ఏడు టీఎంసీల వరకు నీరు ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజికి తరలించి కృష్ణా డెల్టా కాలువలకు విడుదల చేస్తున్న ప్రభుత్వం పులిచింతల నిండితే ఆ నీటిని ప్రకాశం బ్యారేజికి విడుదల చేసి డెల్టాకు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించనుంది.
పులిచింతల ప్రాజెక్ట్ నిండితే గుంటూరు, నల్గొండ జిల్లాలలో పలు మండలాలలో భూగర్భజల మట్టం పెరిగే అవకాశం ఉంది. సాగర్, పులిచింతల కృష్ణా డెల్టా నీటి అవసరాలు తీరిస్తే.. శ్రీశైలం నీటిని మొత్తం రాయలసీమకు పంపిణీ చేయవచ్చు. ఇప్పటికే హంద్రీనీవా, పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని తరలిస్తున్నారు. రాయలసీమలో కరువు పరిస్థితులు ఉన్నాయి. శ్రీశైలం నీటి ద్వారా… ఆ పరిస్థితిని అధిగమించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఎన్నికల ఏడాది నీరు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేస్తోంది.