ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా అంటే ఆరు నెలల ముందు నుంచే డివైడ్ టాక్ ప్రారంభమయింది. అసలు టిక్కెట్ ఇవ్వకూడదనుకున్నారు. కానీ ఆమె నోటిని భరించే శక్తి లేక .. ఇచ్చేశారు. టిక్కెట్ ఇవ్వకపోతే ఆమె చేసే రచ్చ ద్వారానే ఎక్కువ నష్టం జరుగుతుందని వైసీపీ హైకమాండ్ భయపడింది. మంత్రి పదవి కూడా ఆమెకు అదే కారణంతో దక్కింది.
పదేళ్లుగా నగిరికి ఏమీ చేయలేకపోయిన రోజా !
అధికారంలో వైసీపీ లేనప్పుడు ఏమీ చేయలేకపోయానంటే ప్రజలు నమ్మారు కానీ..అధికారం ఉండి కూడా ఐదేళ్లు ఏమీ చేయలేకపోవడమే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడినట్లుగా ప్రజలు నమ్మడం రోజాకు ప్రధాన మైనస్ గా మారింది. ఎప్పుడో తన పుట్టిన రోజుకో సారి ఓ వంద ఫ్యాన్లను స్కూళ్లకు కానుకగా ఇచ్చి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అంతకు మించి చేసిన అభివృద్ధి లేదు.కానీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సోదరులిద్దర్నీ ముందు పెట్టి ఆమె వందల కోట్లు సంపాదించారని సొంత పార్టీ నేతలు మీడియాకు ఎక్కి గగ్గోలు పెట్టారు. మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఆమె లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇదంతా నియోజకవర్గంలో చర్చనీయాంశంగానే ఉంది.
ఎవరితోనూ సఖ్యత ఉండని ఒకే ఒక్క నేత రోజా
మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అవ్వాలంటే నియోజకవర్గంలో పార్టీ నేతలందరితో సఖ్యతగా ఉండాలి. కానీ రోజా స్టైల్ వేరు. నగరి నియోజకవర్గంలో ఒక్క మండలం నేతతో కూడా ఆమె సఖ్యతగా ఉండరు. స్థానికేతకరురాలు అయినప్పటికీ ఆమెను అక్కడి నేతలు రెండు సార్లు గెలిపించారు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఐదు మండలాలకు చెందిన ముఖ్య నేతలు ఆమెకు వ్యతిరేకమే. ఈ ఐదుమండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న వారున్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిల్లో మండలాల్లో పట్టు ఉన్న వారు ఉన్నారు. నగరి మున్సిపల్ చైర్మన్తోనూ గొడవలే. జడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ ఇబ్బందులే. రోజాకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని సవాల్ చేశారు. ఇప్పుడు వారంతా వ్యతిరేకంగానే పని చేస్తున్నారు
రోజాకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి రాజకీయం
ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేతలు ఉన్నారంటే వారికి బలమైన సపోర్టు ఉన్నట్లే లెక్క. రోజా వ్యతిరేక వర్గానికి పెద్దిరెడ్డి సపోర్టు ఉంది. నగరిలో రోజాకు చెక్ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి సీరియస్గా ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా అభిప్రాయం ఉంది. రోజాకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారికి పెద్దిరెడ్డి సపోర్ట్ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన గుప్పిట్లో ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంచారు. కానీ రోజా ఆయనకు వ్యతిరేక వర్గంగా మారిపోయారు. రోజాను ఓడించడానికి పెద్దిరెడ్డి ప్లాన్ రెడీ చేసుకున్నారన్న ప్రచారం భారీగానే జరుగుతోంది.
ఈ సారి తమిళులూ వ్యతిరేకమే !
గత రెండు సార్లు నేతలందరూ కృషి చేసినా స్వల్ప తేడాతోనే రెండు సార్లు విజయం సాధించారు రోజా. నగరిలో తమిళ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. రోజా భర్త సెల్వమణి తమిళుడు. తమిళ పోరాటాల పేరుతో హడావుడి చేస్తూంటారు ఈ నేపధ్యం తమిళ ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడింది. కానీ ఇటీవల రజనీకాంత్ పై రోజా చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గంలోనూ వ్యతిరేకత పెంచుకున్నారు.
ఈ సారి రోజాకు కలసి వచ్చే వారే లేరు !
ఈ సారి రోజుకా కలసి వచ్చే వారే కనిపించడం లేదు. మొదటి సారి 800 ఓట్లు.. రెండో సారి రెండు వేల ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఆమె నోటి దురుసుతో దూరం కాని వర్గం లేదు. ఎన్నికల ఫలితాలు ఆమెకు గుణపాఠం నేర్పుతాయని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఫలితాల తర్వాత రోజా ఏడుపు దృశ్యాలు వైరల్ కావడం ఖాయమని వారే సెటైర్లు వేస్తున్నారు.