అక్కినేని హీరోలకు మాస్ ఇమేజ్ లేదు. ఇప్పటికీ రాలేదు. చాలాసార్లు ట్రై చేశారు చేశారు. కానీ వర్క్ అవుట్ కాలేదు. అలాగని ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఏం తక్కువ కాదు. వాళ్ళని అభిమానించే ఫ్యాన్స్ స్పెషల్ గా వున్నారు. ఏఎన్ఆర్ పేరు తెలుగు సినిమా చరిత్రలో సువర్ణక్షరాలతో రాయదగ్గది. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆయనకంటూ స్పెషల్ గా అభిమానించే కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా అభిమానులు ఎన్టీఆర్ తో ధీటుగా వుంటారు. దేవదాసు, మజ్ను, మూగమనసులు ఒకటేమిటి.. ఆయన చేసిన సినిమాలు, ఎంచుకున్న పాత్రలు అక్కినేనిని అమ్మాయిల కలల రాకుమారుడి చేశాయి.
ఇదే ఇమేజ్ నాగార్జునకి వచ్చింది. ఆయన జనరేషన్ కి వచ్చేసరికి ‘మన్మధుడు’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేశారు ప్రేక్షకులు. అయితే వూరికే ఇచ్చేయలేదు. నాగ్ తెరపై అలాంటి పాత్రలలో కనిపించారు. గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు..ఇలా నాగార్జునని రొమాంటిక్ హీరోని చేశాయి. నాగ్ కూడా తన ఇమేజ్ కు తగ్గ బాడీ లాంజ్వేజ్ అండ్ ఫిజిక్ ని మెంటైన్ చేస్తూ వచ్చారు.
మూడో తరం విషయానికి వస్తే.. అఖిల్ ని మజ్నుగా చూపించే ప్రయత్నం జరిగింది. కానీ దారుణంగా దెబ్బతిన్నారు. అక్కినేని హీరోలకు రొమాంటిక్ , లవర్ బాయ్ ఇమేజ్ వున్న మాట వాస్తవం. అయితే ఇది వాళ్ళు చేసిన పాత్రల ద్వారా వచ్చిందనే సంగతి మర్చిపోయి.. అఖిల్ ని మన్మధుడిగా చూపించి.. బాణం వేసిన ప్రతి అమ్మాయి బెడ్ రూమ్ వెళ్ళిపోతుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆ పాత్రని రాసుకున్నారు. అయితే ప్రేక్షకులు గట్టిగా బుద్ధి చెప్పారు. మూడో రోజుకే బాక్సులు వెనక్కి వెళ్ళిపోయాయి.
అయితే ఇంత అనుభవం వున్న నాగార్జున కూడా ఇదే తప్పు చేశాడు. మన్మధుడు2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున పాత్రని చూసి ముక్కున వేలుసుకున్నారు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్. దీనికి కారణం.. ఈ సినిమాలో ఆయన రొమాంటిక్ యాంగిల్. ‘అక్కినేని’ అంటే రొమాంటిక్ హీరో. కానీ ఇంత అనుభవం వున్న నాగార్జునకి రొమాన్స్ అంటే సెక్స్ అని, చూసి ప్రతి అమ్మాయిని అనుభవించేయాలనే యావ కలిగివుండటమే రొమాన్స్ కి మీనింగనే అర్ధం వచ్చినట్లుగా వుంది నాగార్జున పాత్ర.
నాగార్జున చేసిన పేద్ద బ్లండర్ ఛాయిస్ ఈ సినిమా. ‘అక్కినేని’ ఇమేజ్ ని దెబ్బ తీసిన సినిమా ఇది. అక్కినేనికి ప్రత్యేకంగా అమ్మాయిలు అభిమానులుగా ఏర్పడింది… ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చూసో, గొప్ప అందగాడనో కాదు. తెరపై ఆయన కనిపించిన విధానం అమ్మాయిల మనసు దోచుకుంది. దేవదాస్ సినిమా తీసుకోండి. పారు కోసం చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటాడు దేవదాస్. అందులో ఎంతో రొమాన్స్ వుంటుంది. (నాగార్జున అనుకున్న రొమాన్స్ కాదు) దేవదాస్ లాంటి ప్రేమికుడు మన జీవితంలో వుంటే ఎంత బావున్నో అని అమ్మాయిలు అనుకునేంత గొప్ప ఉటుంది ఆ పాత్ర. అది అక్కినేనిని రొమాంటిక్ హీరోని చేసింది.
ఈ సంగతి నాగార్జునకి తెలియంది కాదు. మన్మధుడు సినిమా విషయానికి వద్దాం. మహాని ఘాడంగా ప్రేమిస్తాడు అభి. మహా, అభిని వదిలి వెళ్ళిపోతుంది. దానితో మొత్తం ఆడవాళ్ళపైనే ద్వేషం పెంచుకుంటాడు. చివరికి నిజం తెలుసుకొని మళ్ళీ ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం ప్రాణం కూడా లెక్క చేయకుండా ఆ ప్రేమ పొందుతాడు అభి. ఈ సినిమాలో అభి పాత్రలో నాగ్ ని చూసి ఫ్లాట్ అయిపోయారు జనాలు.
కానీ చదివితే వున్న మతి పోయినట్లు.. మన్మధుడు2లో ఓ స్త్రీలోలుడి పాత్రని రొమాంటిక్ రోల్ అనుకున్నాడు నాగార్జున. రొమాన్స్ కి సెక్స్ కి మధ్య వున్న చిన్నగీతని మర్చిపోయాడు. ప్రతి అమ్మాయిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళిపోవడమే రొమాన్స్ అనుకున్నాడు. కానీ ఇలాంటి పాత్రకి వుమనైజర్ అనే మీనింగ్ డిక్షనరీలో వుంటుదనే సంగతి మర్చిపోయాడు. పైగా బెడ్ రూమ్ సన్నివేశాల్లో గోడలు వనికిపోవడం, వస్తువులు అదిరిపోవడం ఇలాంటి బీగ్రేడ్ షాట్స్ ని చూపించి పక్కనే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వుంటే సిగ్గుపడి తల దించుకునేలా చేశాడు.
కొద్దిరోజుల క్రితమే కొడుకు అఖిల్ సినిమా ‘మిస్టర్ మజ్ను’కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని నాగార్జున తెలుసుకోవాల్సింది. ప్రతి అమ్మాయిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళిన వాడు.. వుమనైజర్ అవుతాడు కానీ లవర్ కాదని ఏకిపారేశారు ప్రేక్షకులు. ఇప్పుడు నాగార్జున కూడా ఇదే తప్పు చేశాడు. మొత్తానికి మన్మధుడు2 నాగార్జునకి మన్మధుడి ఇమేజ్ కి బదులు బూతు ఇమేజ్ తెచ్చిపెట్టింది.