హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను రాజధాని ప్రాంతం తుళ్ళూరులో జరపాలంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొట్టిపారేశారు. ఈ సమావేశాలను తుళ్ళూరులో ఒక తాత్కాలిక భవనం నిర్మించి, అందులో జరపాలని కోడెల ఇటీవల ఒక ప్రతిపాదన చేశారు. దీనిపై గతవారం అఖిలపక్ష సమావేశంకూడా నిర్వహించారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఒక తాత్కాలిక భవనం నిర్మించి శాసనమండలి సమావేశాలుకూడా దానిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. అమరావతి శంకుస్థాపన పూర్తయ్యాక నిర్మాణాన్ని ప్రారంభించి 40 రోజులలో పూర్తిచేయాలని ప్లాన్ చేశారు. నాడు అఖిలపక్ష సమావేశం పూర్తయిన తర్వాత కోడెల మీడియాతో మాట్లాడుతూ, అన్నిపార్టీలూ తన ప్రతిపాదనకు ఓకే చెప్పాయని అన్నారు. అయితే ఆయన తర్వాత మాట్లాడిన వైసీపీ తదితర పార్టీల నేతలు, ఈ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా అనిపించటంలేదని చెప్పటం విశేషం. తాత్కాలిక భవనాన్ని నిర్మించటం, శాశ్వత భవనం కట్టిన తర్వాత దానిని పడగొట్టటం వృథా ఖర్చు అని తాము భావిస్తున్నట్లు వైసీపీ ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రికూడా అదే భావంతో ఉన్నట్లు కనబడుతోంది. కోడెల ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మొత్తంమీద కోడెల మాట పోయినట్లయింది.