అమరావతిలో అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో చంద్రబాబుపై ఏపీసీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆయన రాజధాని నిర్ణయాన్ని ముందుగా తన అనుచరులకు చెప్పి.. అక్కడ భూములు కొనుగోలు చేయించారని… అభియోగం నమోదు చేశారు. తర్వాత రాజధాని ప్రకటించడం వల్ల అక్కడ భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని.. తద్వారా అసైన్డ్ రైతులు నష్టపోయారనేది సీఐడీ ప్రధాన అభియోగంగా ఉంది. ఈ కేసుల్లో విచారణకు హాజరు కావాలని… ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుల వివరాల్ని గోప్యంగా ఉంచారు.
అమరావతి భూముల ఇష్యూపై ఇప్పటికే అనేక సీఐడీ కేసులు నమోదయ్యాయి. వాటిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరుగుతోంది. అందుకే.. కొత్తగా కేసు నమోదు చేసి… చంద్రబాబు పేరును అందులో చేర్చి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట… రాజధాని ప్రకటన విషయంలో… భూముల అమ్మకాలు.. కొనుగోళ్ల విషయంలో హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది…స్టాక్ మార్కెట్‌కే పరిమితమని.. అది అసలు ఐపీసీలో లేదని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ సీఐడీ… ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే.. ముందుగానే సమాచారం పంపి.. భూములు కొనుగోలు చేయించారన్న ఆరోపణనే ప్రధానంగా చేస్తూ కేసులు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది.
రాజధానిలో భూముల అక్రమాలని అదే పనిగా వైసీపీ ప్రతిపక్షంలో ఆరోపణలు చేసింది. అధికారలోకి వచ్చి రెండేళ్లవుతున్నా… ఎలాంటి అక్రమాలు బయట పెట్టకపోవడంతో … విపక్షాలు కూడా.. ఏం పీకుతున్నారని ప్రశ్నించడం ప్రారంభించాయి. మరో వైపు… హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో… ఆయా కేసులు తేలిపోతున్నాయి. సీబీఐ దర్యాప్తకు చేయించాలని ప్రభుత్వం ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కేంద్రం స్పందించడం లేదు. ఈ క్రమంలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మళ్లీ సీఐడీతో కొత్త కేసు నమోదు చేయించినట్లుగా భావిస్తున్నారు.