తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి… రాత్రికి విజయవాడ తిరిగి వచ్చేశారు. ఇలా వెళ్లి అలా వచ్చారంటేనే.. ఓ ముఖ్యమైన పని ఏదో ఉండబట్టేననే అందరికీ అర్థం అవుతుంది. ఆ ముఖ్యమైన పని ఏమిటన్నది చాలా మందికి సస్పెన్స్ గా మిగిలింది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో.. పార్లమెంట్లో ఆర్థికంగా వెనుకపడిన వర్గాలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరుగుతోంది. అయినప్పటికీ.. ఆయన కీలక నేతలతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో గంట పాటు సమావేశారు. అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్ సహా.. ఇతర నేతలు కూడా చంద్రబాబుతో మాట్లాడారు. ఆ తర్వాత విజయవాడ తిరిగి వచ్చేశారు.
ఇంత హుటాహుటిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టింది… పందొమ్మిదో తేదీన మమతా బెనర్జీ నిర్వహించబోయే ర్యాలీలో అత్యధిక పార్టీలు పాల్గొనేలా చేయడానికేనని.. ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల కిందట డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాంగ్రెస్ కూటమి తరపున… ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ ను ప్రకటించారు. ఇది బీజేపీయేతర కూటమి పార్టీల్లో కలకలం రేపింది. ముఖ్యంగా ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్న నేతలు ఉన్న పార్టీలు… దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తృణమూల్ కాంగ్రెస్ బహిరంగంగానే స్టాలిన్ వ్యాఖ్యలను వ్యతిరేకించి… తమ పార్టీ తరపున మమతా బెనర్జీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంది. దీంతో… విపక్షాల ఐక్యతపైనే అనుమానం ఏర్పడింది. దీన్ని చక్కదిద్ది… ప్రధాని అభ్యర్థి గురించి ఎన్నికల తర్వాతే మాట్లాడుకుందామంటూ… నచ్చ చెప్పి.. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు.. కోల్ కతా ర్యాలీకి హాజయ్యేలా చూడాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ నెల పందొమ్మిదో తేదీన తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలో మహార్యాలీ జరగబోతోంది. ఈ ర్యాలీ కోసం.. మమతా బెనర్జీ.. మూడు నెలల కిందటే కౌంట్ డౌన్ ప్రారంభించి ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా… విపక్షాల ఐక్యతను.. ఈ ర్యాలీ ద్వారా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలోనే చంద్రబాబు చొరవ చూపుతున్నారు. ప్రధాని అభ్యర్థిత్వం.. టాపిక్ కాకుండా… ముందుగా.. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యమని… అందరి చెబుతూ… కోల్‌కతాకు వీలైనన్ని ఎక్కువ పార్టీలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాలీ ముగిసిన తర్వాత.. విపక్ష నేతల సమావేశం కోల్‌కతాలోనే ఉంటుంది.. అక్కడే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని… ప్రాంతీయ పార్టీల నేతలు చెబుతున్నారు.