వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన ఎంపిలతో కలిసి ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ప్రత్యేక హోదా కోరుతూ వినతి పత్రం ఇచ్చి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం తప్ప కేంద్రప్రభుత్వం కాదన్నట్లుగా మాట్లాడారు. ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామాల ప్రస్తావన షరా మామూలే. జగన్ డిల్లీ వెళ్ళినా విదేశాలకి వెళ్ళినా చంద్రబాబు నాయుడునే తలుచుకొంటూ ఉండటం విశేషమే.
ప్రత్యేక హోదా అనేది కేవలం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే తీసుకోగల నిర్ణయం అని జగన్ చాలాసార్లు చెప్పారు. మరి అటువంటప్పుడు ఆయనపై ఏవిధంగా ఒత్తిడి చేయాలో ఆలోచించకుండా, ప్రధానిపై చంద్రబాబు ఒత్తిడి చేయడం లేదని పదేపదే నిందించడం ఎందుకు? చంద్రబాబుని నిందిస్తే జగన్ అక్కసు తీరుతుందేమో కానీ ప్రత్యేక హోదా రాదు. చంద్రబాబుకి ప్రత్యేక హోదా సాధించాలనే ఆసక్తి, చిత్తశుద్ధి, పట్టుదల లేవని జగన్ చాలాసార్లు ఆక్షేపించారు. ఆయనకి లేదని తెలిసి ఉన్నప్పుడు ఇంకా ఆయనని నిందిస్తూ కాలక్షేపం చేయడం కంటే కేంద్రప్రభుత్వంపై ఏవిధంగా ఒత్తిడి చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది కదా? రాష్ట్రంలో ధర్నాలు, బందులు చేస్తూ చంద్రబాబుని విమర్శించడం కంటే, డిల్లీలోనే ధర్నాలు, వీలైతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తే ప్రత్యేక హోదాపై తాడోపేడో తేలిపోతుంది కదా?
చంద్రబాబుకి ఆసక్తి లేదు కనుక ప్రత్యేక హోదా కోసం కృషి చేయడం లేదు. సరే..ఆయన సంగతి ప్రజలు చూసుకొంటారు. మరి ప్రత్యేక హోదా కోసం ఇంతవరకు జగన్ ఏమి చేశారు? ఇకపై ఏమి చేయాలనుకొంటున్నారు? స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా!