విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశను కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా ‘నేరుగా బయటి’ నిధులతోనే పూర్తి చేయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో కొత్త దృశ్యాన్ని ఆవిష్కరించేలా వుంది. దేనికీ కలసిరాని కేంద్రం ముందు ఇలాగే వుండాలన్న ఉద్వేగపూరితమైన మద్దతు కూడా ఆయనకు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంకోసం మధ్య ఆసియాలో ఉజ్బెక్కిస్ధాన్, కిజికి స్ధాన్ మొదలైన చిన్న దేశాల రాజధానులను పరిశీలించి రావాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా లేఖ ద్వారా సూచించాక కూడా చంద్రబాబు ‘సింగపూర్ నమూనా’నే కొనసాగించే సన్నాహాల్లో వుండటం ఈ సందర్భంగా గమనార్హం. ఇవేమీ ధిక్కారాలు కాదు. మిత్రపక్షంగా వుంటూనే స్వతంత్ర వైఖరిని చంద్రబాబు ఎంచుకున్నారనడానికి సూచికలు మాత్రమే.
సింగపూర్ ప్లానులను రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో వెల్లడించడానికి ఒకరోజుముందే ప్రధాని నుంచి లేఖఅందింది. ఆసమయం సందర్భాలను పరిగణనలోకి తీసుకుంటే రాజధాని విషయంలో మరికొన్ని ఆప్షనలను కూడా చూడాలన్న మిత్రవాక్యం అన్యాపదేశంగా వుంది.
కేంద్రం పాటిస్తున్న నియమాలను అనుసరించి ఆర్ధికపరమైన గిట్టుబాటు రీత్యా 20 లక్షలమంది జనాభా వుంటేగాని ప్రాజెక్టుని ఆమోదించరు. ఈ ఆమోదం వల్ల మొత్తం ఖర్చులో 20 శాతం కేంద్రం నుంచి లభిస్తుంది. విజయవాడ మెట్రోరైలు మొదటిదశకు దాదాపు 7 వేల కోట్లరూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రత్యేకపరిస్ధితుల్లో జనసంఖ్యపరిమితిని సడలించాలని విన్నపాలు వివరణలు ఇచ్చి బతిమిలాడుకుని ఆమోదింపజేసుకుంటే ఢిల్లీ విదిలించేది 14 వందల కోట్లరూపాయలు ఈ పాటిదానికే ఢిల్లీ ప్రదక్షిణలకోసం కాలయాపన ఎందుకనుకున్నారో ఏమో మెట్రోరైలు మీద పెట్టుబడి పెట్టడానికి వచ్చిన జపాన్ కంపెనీతో పనికానిచ్చేద్దామనుకున్నారు. దీని అర్ధం ఢిల్లీలో విజయవాడ మెట్రో రైలు కధ ముగిసి పోయిందని కాదు. అప్పు చేసి ఈ పని చేసుకున్నాం సాయం చేయండి అన్న విన్నపం ఫైలు వుండనే వుంటుంది. బిజెపి, తెలుగుదేశం పార్టీల పరస్పర అవసరతలు దగ్గరపడి నపుడు ‘ఎస్’ అవుతుంది. అంతవరకూ పెండింగ్ లో వుంటుంది.
రాజధానికి నిర్మాణానికి కేంద్రం నిధులేవి అన్న ప్రశ్న తెలుగుదేశం చిన్న నాయకులనుంచి గట్టిగా, పెద్దనాయకులనుంచి గుసగుసలుగా వినబడుతూంటుంది. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా ఎంతని మంజూరు చేయాలి ఎంతని విడుదల చేయాలని బిజెపి నాయకులు కూడా గుసగుసలు పోతారు. అధికారమెక్కేసిన ఈ రెండు పార్టీలూ కూడా ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవడమే లేదు. లేకపోతే ఇరువురూ గుసగుసలు మాని, ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకోడానికి గ్రౌండ్ వేసుకోవడం మాని వాస్తవాలు ప్రజల ముందుంచేవారే.
భవిష్యత్తు పరిణామాలకు గ్రౌండ్ వేసుకోడానికో ఏమో ఇతరనగరాలను కూడా పరిశీలించి రావాలని నరేంద్రమోదీ లేఖ రాయగా, రాజమండ్రిలో జరిగిన ఎపి కేబినెట్ సమావేశంలోనే ఆలేఖను చదివి వినిపించారు. సూచన చేసిన ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనగరాలు పరిశీలించి రావాలని తీర్మానం చేశారు. చంద్రబాబు సింగపూర్ నమూనాకే కమిటైపోయారని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలుసు. ప్రధాని కార్యాలయానికీ తెలుసు. అయినా పరస్పర సంబంధాల్లో గౌరవ మర్యాదలకు సంబంధించి ఈ లాంఛనాలు ”అయిననూ పోయిరావలె హస్తినకు” అన్నట్టు తప్పని సరిగా వుండవలసిందే!