హైదరాబాద్: సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్ సమాజంలో పలు మార్పుచేర్పులకు, నేరాలకు, నేరస్తులు పట్టుబడటానికి కారణమవుతోంది. బాయ్ ఫ్రెండ్‌ను హత్యచేసి, ఆ పనిని ఫేస్బుక్లో ప్రకటించుకున్న 18 ఏళ్ళ ఒక యువతిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. నకాసియా జేమ్స్ అనే ఆ యువతి డొరియన్ పొవెల్ అనే తన బాయ్ ఫ్రెండ్‌ను గతవారం హత్యచేసింది. వీరిద్దరికీ ఒక చిన్న విషయం దగ్గర ప్రారంభమైన గొడవ హింసాత్మకంగా మారి పొవెల్ మృతికి దారితీసింది. మొదట అతను ఆమెను ముఖంమీద కొట్టాడు. తర్వాత ఆమె పక్కనే ఉన్న కత్తిని తీసుకుని అతనిని పొడిచేసింది. కత్తి తీసుకుని అతనని పొడిచానని, అతను గాయపడతాడని తాననుకోలేదని, కానీ అతను చనిపోయాడని, తాను పరారయ్యానని తర్వాత ఫేస్బుక్లో పేర్కొంది. తాను అతనిని పొడవాలని అనుకోలేదన్న విషయం భగవంతుడికి కూడా తెలుసని రాసింది. భగవంతుడికి సారీ చెబుతూ, తనను దేవుడు క్షమిస్తాడని భావిస్తున్నానని, పొవెల్‌కు కూడా సారీ చెప్పింది. అతని ఆత్మ శాంతిని పొందాలని ప్రార్థించింది. పోలీసులు ఈ నెల 11న పొవెల్ చనిపోయినట్లు కనుగొన్నారు. ఫేస్ బుక్ పోస్ట్ సాయంతో నకాసియా జేమ్స్‌ను ఆదివారం క్యాలిఫోర్నియాలోని హెమెట్ నగరంలో అరెస్ట్ చేశారు.