ఏపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించడానికి ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా నాలా ఫీజును రద్దు చేయాలని నిర్ణయించారు. నాలా ఫీజు అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ ఫీజు. వ్యవసాయ భూమిని పరిశ్రమలు, ఇళ్లు నిర్మించుకోవడానికి .. కన్వర్షన్ చేయించుకోవాలి. ఇందు కోసం గతంలో మూడు శాతం పన్ను ఉండేది. వైసీపీ వచ్చాక ఐదు శాతం చేసింది.
ఈ ఫీజు మాత్రమే సమస్య కాదు అధికారులు దీన్ని తమ లంచాలకు ఆదాయ వనరుగా చేసుకున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ల్యాండ్ కన్వర్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ కోసం దరఖాస్తు చేస్తే, రెవెన్యూ అధికారులు గద్దల్లా వాలిపోతారు. భూమిని ప్లాట్లుగా మార్చి రోడ్లు వేస్తే, అడిగినంత చెల్లించాల్సిందే. లేకపోతే అనుమతి కోసం కాలయాపన తప్పదువీటిని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు నాలా చట్టాన్ని రద్దు చేస్తామని కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు.
నాలా చట్టం అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని రియల్టర్లు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. నాలా చట్టం రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి ఊపందుకుంటుందని, పారిశ్రామికవేత్తలకు సులభతరమైన అనుమతులు లభిస్తాయి. నాలా చట్టం రద్దుతో ల్యాండ్ కన్వర్షన్ కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేబినెట్ నిర్ణయాల తర్వాత విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉంది.