వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా అధికారయంత్రాంగంపై తిరుగుబాటు చేశారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని సవాల్ చేశారు. ఎస్పీ, కలెక్టర్లకు ఈ మేరకు బహిరంగ సవాల్ విసిరారు. దీనికి కారణాలు ఉన్నాయి.. కొన్ని రోజుల క్రితం.. నల్లపురెడ్డి.. పేదలకు సాయం పంపిణీ చేశారు. అయితే.. అక్కడ సోషల్ డిస్టెన్స్ లాంటివేమీ పాటించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుడే బుచ్చిరెడ్డి పాళెం పోలీస్ స్టేషన్లో ధర్నా చేసిన నల్లపురెడ్డి కేసు ఉపసంహరించుకోకపోతే… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అప్పటికి అధికారులు సర్దుబాటు చేశారు కానీ.. కేసు తీసేయలేదు. ఆ ఘటనతో ఆయనకు.. అధికారులకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది.
ఇటీవలి జడ్పీ హాల్లో.. అధికార యంత్రాంగంతో ఓ సమావేశాన్ని నిర్వహించారు.దానికి సంబంధించి నల్లపురెడ్డి ఆహ్వానం రాలేదో.. లేక.. మరో కారణమో.. కానీ.. అసలు అంత మందితో ఆ సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ విమర్శలు చేశారు. తాను సాయం చేస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. పైగా తాను పారిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారని… విమర్శిస్తున్నారు. తాను పారిపోలేదని.. పోలీస్ స్టేషన్లోనే ఉన్నానని దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోవాలని చాలెంజ్ చేస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం.. వైసీపీలో కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతగా ఉండాల్సిన ఆయన.. సొంత ప్రభుత్వ అధికారులపై చెలరేగిపోవడం.. ప్రజల్లో పార్టీపై చులకన భావం తెస్తుందని తెలిసినా.. ఆయన వెనక్కి తగ్గడం లేదన్న అసహనం .. వైసీపీ అగ్రనేతల్లో కనిపిస్తోంది.
అయితే.. నెల్లూరు వైసీపీ అంతర్గత రాజకీయాల్లో… నల్లపురెడ్డికి ప్రాధాన్యత లేకండా పోయింది. అధికారులు తన మాట మాత్రం వినకుండా.. అందరి మాటలు వింటున్నారన్న ఆగ్రహం నల్లపురెడ్డిలో కనిపిస్తోందంటున్నారు. అధికార యంత్రాంగం.. మాత్రం నల్లపురెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇలాంటిప్రకటనలు చేయడం వల్ల.. ప్రజల్లో అధికారులు చులకన అవుతారని అంటున్నారు. మరి వైసీపీ నాయకత్వం ఏం చేస్తుందో మరి..!?