సమైఖ్య ఆంధ్రాకు చివరి ముఖ్యమంత్రిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి, ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్నే తప్పుబట్టి నిరసన గళం వినిపించారు నల్లారి. ఆ తరువాత, తెలంగాణ ఏర్పాటు కావడం, ఆయన కాంగ్రెస్ కు దూరం కావడం, తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసినా, దాని ఉనికిని ఆంధ్రులు సైతం గుర్తించకపోవడం.. ఇలాంటి కారణాలతో రాజకీయంగా ఆయన తెర మరుగు అయిపోయారు. అయితే, ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయనే తరుణంలో మరోసారి నల్లారి సోదరుల పేర్లు తెరమీదికి వచ్చాయి. నల్లారి కిరణ్ తోపాటు, ఆయన సోదరుడు కిశోర్ కుమార్ కూడా తెలుగుదేశంవైపు చూస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
కిరణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై తరచూ ఏవేవో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ లో చేరతారంటూ ఈ మధ్య కొంత చర్చ జరిగింది. దానిపై ఆయన పెద్దగా స్పందించిందీ లేదు. నిజానికి, పీలేరు నియోజక వర్గంలో నల్లారి కుటుంబానికి మంచి గుర్తింపే ఉంది. కిరణ్ ముఖ్యమంత్రి అయిన తరువాత దాదాపు రూ. 2 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంత చేసినా పీలేరు నుంచి సోదరుడు కిశోర్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఇప్పుడు కిరణ్ సోదరుడు కిశోర్ టీడీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నియోజక వర్గంలోని వివిధ ప్రాంత నేతలతో ఆయన భేటీ అవుతున్నారట. రాజకీయ జీవితంలో ఇలాంటి ఒడిదొడుకులు తప్పవనీ, ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఉన్నారనీ, ప్రజలందరి సలహా మేరకే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెబుతున్నారట. ఇదే తరుణంలో, చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేతల ద్వారా మంత్రి నారా లోకేష్ కు కిశోర్ టచ్ లోకి వెళ్లారని సమాచారం. పీలేరు నియోజక వర్గం నుంచి బలమైన నేత కోసం టీడీపీ కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కిశోర్ చేరికపై చంద్రబాబు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలను కిశోర్ కూడా కొట్టి పారేయడం లేదు.
త్వరలోనే టీడీపీ నుంచి ఆయనకు ఆహ్వానం వస్తుందని కూడా జిల్లా వర్గాల్లో వినిపిస్తోంది. కిశోర్ తోపాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా టీడీపీ వైపే చూస్తారా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న..? ఆయన స్వయంగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు కథనాలు లేవు. కానీ, అన్నదమ్ములు ఇద్దరూ వేరు కాదనీ, ఇద్దరూ ఒకే పార్టీలో ఉంటారనీ, వేర్వేరు వేదికలపై ఉండబోరని పీలేరు వర్గాలు అంటున్నాయి. కిశోర్ కు టీడీపీ నుంచి ఆహ్వానం అందితే.. ఆ తరువాత, కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేరతారని అంచనా వేస్తున్నారు. చేరితే ఇద్దరమూ ఒకే పార్టీలోనే చేరతామని కిశోర్ కూడా బహిరంగంగానే చెబుతున్నారు. ఇంకేం, దాదాపుగా రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. వీరి చేరికపై టీడీపీ నుంచి కూడా పెద్దగా అభ్యంతర పెట్టేంత కారణాలేవీ కనిపించడం లేవనే అంటున్నారు.