లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురుదెబ్బ తగలడమే కాదు… కేసీఆర్‌కు మరో పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. ఆ చిక్కు.. తెలంగాణ పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేయడం. ఎంపికైనా తొమ్మిది మందిలో… నామా నాగేశ్వరరావు మాత్రమే… కాస్త యోగ్యుడిగా కనిపిస్తున్నారు. కానీ ఆయనకు పదవి ఇస్తే టీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్న అసంతృప్తి మరింత డబుల్ అయ్యే ప్రమాదం ఉంది.
గత లోక్‌సభలో.. టీఆర్ఎస్ తరపున జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్… లోక్‌సభలో తమదైన గళం వినిపించారు. వీరిలో జితేందర్ రెడ్డికి టిక్కెట్ దక్కలేదు. వినోద్ కుమార్ ఓడిపోయారు. బాల్క సుమన్ ఎమ్మెల్యే అయ్యారు. సీతారాం నాయక్ కు టిక్కెట్ ఇవ్వలేదు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, బూర నర్సయ్య గౌడ్ లు ఓటమిపాలయ్యారు. తాజాగా గెలిచిన వారిలో పార్లమెంట్ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలన్నది కెసీఆర్‌కు కత్తిమీద సాములా మారింది. టీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలోఒకరికి లోక్‌సభాపక్ష నేత, మరొకరికి ఉపనేత పదవులు దక్కనున్నాయి. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు ఉన్న ఎంపీలను వడపోసి పార్టీ వాయిస్ ను జాతీయ స్థాయిలో వినిపించే నేతను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండు సార్లు గెలవడంతో పాటు వాగ్దాటి ఉన్న నేతను ఎంపిక చేయాలని కెసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలు దక్కించుకోవాలంటే కేంద్రంపై గట్టిగా గళం వినిపించే నేత అవసరమని కెసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి రెండోసారి ఎన్నికైన ఎంపీల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. అయితే బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డిలకు వాగ్ధాటి లేదు. ఖమ్మం నుంచి ఎంపిగా గెలిచిన నామా నాగేశ్వర్ రావు పేరు ఇప్పుడు పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గతంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా పని చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల ముందే టీఆర్ఎస్ లో చేరడంతో గులాబీ బాస్ కాస్త వెనుకాముందు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఈ పదవి అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయనే చర్చ జరుగుతోంది.
మహబూబ్ నగర్ నుంచి గెలిచిన మన్నె శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి గెలిచిన మాలోత్ కవిత, చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి కొత్తవారు. రెండోసారి వరంగల్ నుంచి గెలిచిన పసునూరి దయాకర్ కు వాగ్దాటి లేకపోవడం మైనస్ గా కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి గెలిచిన రాములు సీనియర్ అయినా పార్లమెంటుకు కొత్త ముఖం కావడంతో కెసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై పార్టీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. చివరికి నామాకే పదవి అప్పగించవచ్చని చెబుతున్నారు.