తెలంగాణలో టీడీపీ అంతో ఇంతో బలంగా ఉందని చెప్పుకుంటున్న జిల్లాల్లో ఖమ్మం జిల్లా ఒకటి. ఆ జిల్లా నుంచి నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్యతో పాటు మరికొంత మంది నేతలు టీడీపీ కోసం గట్టిగానే పని చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు పార్లమెంట్ పైనే గురి పెట్టినప్పటికీ.. ఇప్పుడు విడివిడిగా ఎన్నికలు రావడంతో.. ఆయన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్ గెలుపొందారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. ఈ సారి అజయ్ టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ – టీడీపీ మధ్య పొత్తు ఖాయం కావడంతో.. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం అసెంబ్లీతో పాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలను కేటాయించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. వైరా సంగతి ఎలా ఉన్నా ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాలను వదిలిపెట్టే ప్రశక్తేలేదని టిడిపి నేతలు చెబుతున్నారు. టీడీపీకి ఖమ్మం సీటు కేటాయిస్తే అందరూ నామా నాగేశ్వరరావునే బరిలోకి దిగమని కోరుతున్నారు. పార్టీ సమావేశాల్లో.. నామాపై తీవ్ర స్థాయిలో నేతలు ఒత్తడి తెస్తున్నారు.
ఖమ్మం లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అజయ్ ముందు అంతంత మాత్రం గా ఉన్న వాళ్ళు నిలబడటం కష్టం. అంగ, ఆర్థిక బలాలు ఉంటేనే.. అజయ్‌ని తట్టుకోగలుగుతారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన అభ్యర్థి లేరు. టీడీపీలో కూడా నామానే అజయ్‌కు సరైన జోడిగా భావిస్తున్నారు. నామా మాత్రం ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. గత ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతోనే నామా ఓటమి పాలయ్యారు. ఈ సారి గెలుపు ఖాయమని ఆయన నమ్మకంతో ఉన్నారు. అయితే .. ఎన్నికల సన్నహాలు మాత్రం ఖమ్మంలో టీడీపీ జోరుగానే నిర్వహిస్తోంది. బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కొత్త ఓటర్లను నమోదు చేయిస్తున్నారు. మొత్తానికి ఈ సీటు టీడీపీకి కేటాయిస్తే.. బరిలో ఉండేది మాత్రం నామానే అని అక్కడి టీడీపీ కార్యకర్తలు.. గట్టి నమ్మకంతో ఉన్నారు.