తెలంగాణ రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి ఎంతసేపూ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పుడు పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరాస ముందుగానే తుమ్మల పేరును అభ్యర్థిగా ప్రకటించేయడంతో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. తెరాస సర్కారు ఏర్పడిన తర్వాత.. వరుసగా దారుణమైన పరాజయాలను మాత్రమే చవిచూస్తున్న తెలుగుదేశం పార్టీ .. తమకు అంతో ఇంతో క్షేత్రస్థాయిలో బలం ఉన్నదని అనుకుంటున్న ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ ఎన్నికలో అయినా విజయం సాధించి పరువు కాపాడుకోవాలనే ధ్యేయంతో బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తెదేపా తరఫున గతంలో ఎంపీగా కూడా పనిచేసిన నామా నాగేశ్వరరావు అయితే తుమ్మలకు గట్టిపోటీ అవుతారని, తమకు విజయావకాశాలు మెరుగవుతాయని తెతెదేపా భావిస్తున్నది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. రాజకీయంగా మౌనంగానే ఉన్న నామా నాగేశ్వరరావు ఈ పోటీకి అంత సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఒకప్పట్లో తెలుగుదేశానికి ఉన్న అగ్ర నాయకుల్లో తుమ్మలతో పాటు నామా నాగేశ్వరరావుకు కూడా సమ ప్రాధాన్యం ఉంది. గతంలో ఆయన ఎంపీగా బరిలోకి దిగినప్పుడు.. ఆ సమయానికి అత్యంత సంపన్నుడైన కోటీశ్వరుడైన ఎంపీ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు కూడా! 2014 ఎన్నికల్లో మారిన సమీకరణాల నేపథ్యంలో వైకాపా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. తీరా ఇప్పుడు పాలేరునుంచి ఆయనను బలమైన అభ్యర్థిగా దింపాలని తెతెదేపా భావిస్తున్నది. కానీ ఆయన మాత్రం సుముఖంగా లేరని, కావలిస్తే తన కొడుకుకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని సమాచారం. పార్టీ మాత్రం చంద్రబాబుతో చెప్పించి అయినా సరే.. ఆయననే బరిలోకి దించాలని యోచిస్తున్నది.
అదే సమయంలో.. పాలేరు నియోజకవర్గం తనకు తప్పకుండా పట్టం కడుతుందని, తనేంటో పాలేరు ప్రజలకు తెలుసు అని.. తన ప్రత్యర్థి నామానా? మరొకరా? అనేది పట్టించుకోను అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటిస్తున్నారు. ఎంతో విశ్లేషణ అనంతరం, మంచి చెడులు లెక్కించాకే పార్టీ తన పేరును అభ్యర్థిగా ప్రకటించినట్లు చెబుతున్నారు.
నిజానికి పాలేరు కాంగ్రెస్ పార్టీకి సిటింగ్ స్థానం. వారి బలంతో పాటూ.. రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోయాడనే సానుభూతి కూడా వారికి ఎడ్వాంటేజీ అవుతుంది, మరోవైపు ఖమ్మం జిల్లాలో తమకంటూ ఓట్లు ఉన్న నేపథ్యంలో వైకాపా కూడా పాలేరును వదలిపెట్టకపోవచ్చు. ఇలా పోటీ చతుర్ముఖంగా మారితే.. ఎవరి అవకాశాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం. ఏది ఏమైనా.. తెదేపా అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి నామా ఓకే చెబుతారా లేదా అన్నది సస్పెన్స్‌గానే ఉంది.