పార్టీల చేతుల్లో ఉన్న పత్రికలు అంతే. ఒకటి చెబితే మరొకటి రాసుకుంటాయి. వాళ్ల ఫోటోను జబర్దస్తీగా వాడేస్తాయి. అయితే వారు ఖండించినా లైట్ తీసుకోరు. సాక్షి పత్రికలో ఇలాంటివి కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ ఫోటోలో ఉన్న వారు మీడియా ముందుకు వచ్చి తాను అలా చెప్పలేదని మొత్తుకున్నా కనీసం సవరణ కూడా వేయరు. కానీ అదే తరహాలో ఎడిటోరియల్ స్టాండర్డ్స్ ఉండే నమస్తే తెలంగాణ మాత్రం క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
టీఆర్ఎస్ పేరు మార్చి.. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తించారు., జాతీయ స్థాయిలో కూడా కొంత మంది అభిప్రాయాలు తీసుకున్నారు. కేసీఆర్ తప్ప దేశాన్ని ఇంకెవరూ కాపాడలేరన్నట్లుగా ఉన్న ఆ అభిప్రాయాలు నమస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఇలా వచ్చిన అభిప్రాయాల్లో లిజ్ మాథ్యూ అనే జర్నలిస్టుది కూడా ఉంది. ఆమె డిల్లీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన ఫోటోతో సహా వచ్చిన ఆర్టికల్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఖండన ట్వీట్ పెట్టింది. రాజకీయాల్లో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేసింది.
దీంతో నమస్తే తెలంగాణకు షాక్ తగిలినట్లయింది. ఇది మొత్తంగా ఎవరైనా నమస్తేతో మాట్లాడాలంటేనే భయపడేటట్లు చేసింది. అందుకే వెంటనే క్షమాపణ చెబుతున్నట్లుగా ఆ సవరణ వేసేశారు. కానీ నమస్తే, సాక్షి లాంటి పత్రికలతో మాట్లాడాలంటే.. వారిష్టం వచ్చింది రాసుకునేందుకు అంగీకారమైతేనే మాట్లాడాలి..లేకపోతే లేదన్న అభిప్రాయం మాత్రం ఇలాంటి వాటి ద్వారా ఎప్పటికప్పుడు బలపడుతూ ఉంటుంది.