తమిళనాడు ‘సినీ’ రాజకీయాలకు కేంద్ర బిందువు. సినీ తారలు ముఖ్యమంత్రులుగా వెలుగొందిన రాష్ట్రమది. 2026 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సినీ తారల సందడి మరోస్థాయిలో ఉండబోతుంది. హీరో విజయ్ రానున్న తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా ఇటీవలే ‘తమిళక వెట్రి కజగం’ అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనపై పోటీకి దిగే సినీతార కూడా సిద్దమయ్యారు. హీరోయిన్ నమిత విజయ్ పై పోటీకి దిగుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు తెలిపిన నమిత, విజయ్ కి ప్రత్యర్ధిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. బలమైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని, అందుకే విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాని కొచ్చారామె. ప్రస్తుతం నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా వున్నారు. అయితే నమిత చేసిన ప్రకటన అప్పుడే సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబితే.. విజయ్ అభిమానులు మాత్రం డిపాజిట్లు కూడా రావని కామెంట్లు పెడుతున్నారు.