2018లో నమోదైన టాలీవుడ్ హీరోల డ్రగ్స్ కేసులను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఓ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు దొరికిన ఫోన్ ఆధారంగా చేసిన దర్యాప్తులో అనేక మంది హీరోలు, హీరోయిన్లపై పోలీసులు కేసులు ెట్టారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై అప్పట్లో అకున్ సభర్వాల్ నేతృత్వంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. రోజుల తరబడి సీరియల్ లాగా నటులను పిలిచి.. చాలా పెద్ద కథలు లీక్ చేశారు. చివరికి ఆ కేసు బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించుకున్నట్లుగా మారిపోయింది. తర్వాత కోల్డ్ స్టోరేజీలోకివెళ్లిపోయింది. మొత్తంగా టాలీవుడ్ డ్రగ్స్‌పై 8 కేసులు నమోదు చేసింది సిట్.
8 కేసుల్లో ఆరు కేసులను కొట్టివేసిన నాంపల్లి కోర్టు తాజాగా కొట్టి వేసింది. సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో కొట్టి వేస్తున్నట్లుగా జడ్జి ప్రకటించారు. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్‌ను కూడా పోలీసులు ఫాలోకాలేదని కోర్టు స్పష్టం చేశారు. కొట్టేసిన ఆరు కేసుల్లో కనీస ఆధారాలు కూడా లేవు. నటులను విచారణకు పిలిచి డైలీ సీరియల్ లా విచారణాధికారులు కథ నడిపించారు. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపించిచారు. పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ మాత్రమే పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్.. వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక, సాక్ష్యాలను చూసి కేసులను కొట్టివేసింది. నిజానికి ఈ కేసుల్లో ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఈడీ విచారణ చేపట్టినప్పుడు హడావుడిగా ఆధారాలు లేవని కోర్టుకు చెప్పారు.
ఈడీ డ్రగ్స్ వాడారా లేదా అన్నదానిపై పరిశీలన చేయలేదు. డబ్బులు ఎలా చెల్లించారన్నదానిపై పరిశీలన జరిపింది. పోలీసులు సహకరించకపోవడం ఆధారాలు ఇవ్వకపోవడంపై ఈడీ కోర్టుకు కూడా వెళ్లింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా కోర్టుకు వెళ్లారు. అయితే ఉద్దేశపూర్వకంగా పోలీసులు నీరుగార్చడంతో.. కేసులేవీ న్యాయస్థానాల్లో నిలబడలేదు.