రజనీ కాంత్ ను సూపర్ స్టార్ అని, వెండితెర దేవుడని కొలిచేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. సినిమాలో కథ ఎలా ఉన్నా రజనీ ఫేస్ కోట్లల్లో ఓపెనింగ్ కలెక్షన్లు పొందే నిర్మాతలు, బయ్యర్లకు రజనీ నిజంగా దేవుడే. కబాలి మేనియా చాలా మందిని ఊపేసింది. సినిమా బాగాలేదని టాక్ వచ్చినా దబ్బులు మాత్రం వస్తూనే ఉన్నాయి. వారం పదిరోజుల తర్వాత థియేటర్లు ఖాళీగా ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ హీరోలే అసూయ పడే స్టార్ డమ్ ను రజనీ సొంతం చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి సూపర్ స్టార్ కానే కాదన్నాడు మరో నటుడు.
బాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు తీయడం, వైవిధ్యమైన పాత్రల్లో జీవించడంలో నానా పాటేకర్ కు మంచి పేరుంది. పాత్రలో ఇమిడిపోయి సహజంగా నటించే నానా పాటేకర్ కు ప్రత్యకంగా అభిమానులూ ఉన్నారు. ఇక ఆయనే తీసిన సినిమాల్లో వైవిధ్యం ఉట్టి పడుతుంది. కథను నమ్ముకుని సినిమాలు తీసేవాళ్లలో నానా పాటేకర్ ఒకడు. మానవత్వంతో సామాజిక సేవచేయడంలోనూ ముందుంటాడు. అలాంటి నానా పాటేకర్, రజనీకాంత్ సూపర్ స్టార్ కానేకాడని తేల్చి చెప్పేశాడు.
ఎప్పటికైనా సినిమానే సూపర్ స్టార్ అన్నాడు. మంచి కథ, దాన్ని సరిగ్గా చూపించడం మీదే సినిమా ఆధార పడి ఉంటుందట. చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఘన విజయం సాధించిన ఉదాహరణలు చెప్పాడు. అలాంటి సినిమాలో నటించిన వాళ్లందరికీ మంచిపేరు వస్తుందని, స్టార్ ఇమేజి వస్తుందని చెప్పాడు. అట్లాంటి సినిమాల్లో నటించిన హీరోకు ఆటోమేటిగ్గా సూపర్ స్టార్ ఇమేజి వస్తుంది. అయినా అతడు హీరో కాదు. కథాబలం లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఫ్లాప్ అవుతుందని నానాపాటేకర్ చెప్పాడు.
పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఢామ్మన్న సందర్భాలు ఎన్ని లేవని ప్రశ్నించాడు. లేనిపోని స్టార్ ఇమేజిని నమ్ముకుని సినిమా తీసినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరిస్తారనే గ్యారంటీ లేదని నానా పాటేకర్ ఒక ఇంటర్ వ్యూలో చెప్పాడు.